Anubhavinchu Raja: బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నచ్చదు కానీ.. : రాజ్‌ తరుణ్‌

24 Nov, 2021 17:04 IST|Sakshi

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రాజ్‌ తరుణ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

‘అనుభవించు రాజా’సినిమా ఎలా ఉండబోతుంది?
అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఫ్యామిలీ, తండ్రి కొడుకుల సంబంధంతో పాటు విలేజ్‌ ఎమోషన్స్‌ కూడా బలంగా ఉన్నాయి.

బంగారం క్యారెక్టర్‌ ఎలా అనిపించింది?
బాగా నచ్చింది. ఆ పాత్రను ఎంజాయ్‌ చేస్తూ సినిమా షూటింగ్‌ చేశాం. ప్రేక్షకులకు కూడా ఆ పాత్ర బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది.

ఈ మూవీలో సెక్యూరిటీ గార్డుగా చేశారు. ఆ పాత్రకు కోసం ఎలా ప్రిపేర్‌ అయ్యారు?
మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది.  పొద్దున్న మన గేట్ తీసేది సెక్యురిటే, రాత్రి గేట్ వేసిది సెక్యురిటే. వాళ్ళు నవ్వుతూ పనిచేస్తే ఆ రోజంతా మనకు బావుంటుంది. అలా నవ్వుతూ ఆ జాబ్ చేయడం అంత ఈజీ కాదు.

ట్రైలర్‌ చూస్తే కోడి పందాలు ఎలిమెంట్స్‌ కనిపించాయి.  మీ నిజ జీవితంలొ కోడిపందాలు వేశారా?
లేదు. బెట్టింగులు, గ్యాబ్లింగ్ అంటే నాకు అస్సలు నచ్చదు. వాటి జోలిని ఎప్పుడు వెళ్లలేదు.వెళ్లను కూడా.  సంక్రాంతి కోళ్ళ పందాలు చూశాను. మా సినిమాలో సంక్రాంతి వుంది. ఈ సినిమాలో కోడిని షూటింగ్ కోసం తీసుకొచ్చాం. షూటింగ్ అయిపోయాక ఇంటికి తీసుకెళితే అది తినడం లేదని చెప్పారు. బహుశా దానికి కూడా షూటింగ్ అలవాటైపొయిందేమో (నవ్వుతూ).

భీమవరం షూటింగ్ ఎలా అనిపిచింది ? 
నా కెరీర్ సగం సినిమాలు అక్కడే చేశా. అక్కడ మనుషులు, ఫుడ్ బావుంటుంది. సరదాగా గడిచిపోయింది.

దర్శకుడు  శ్రీనివాస్ గవిరెడ్డితో రెండో సినిమా. తొలి సినిమాకి ఇప్పటికి అతనితో ఎలా అనిపించింది?
శ్రీనివాస్ నా బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్‌ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేసినప్పుడు  అతను కుర్రాడు. ఇప్పుడు చాలా మెచ్యురిటీ వచ్చింది. చాలా నెమ్మది వచ్చింది. సినిమాని అర్ధం చేసుకోవడంలో అప్పటికి ఇప్పటికి స్పష్టమైన తేడా కనిపించింది.

అన్నపూర్ణ స్టూడియోస్‌తో సంబంధం?
అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే నేను హీరోగా(ఉయ్యాలా జంపాలా మూవీ) పరిచయమయ్యారు. ఇప్పుడు అదే బ్యానర్‌పై మూడో సినిమా చేస్తున్నాను. అంత పెద్ద బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం

నాగచైతన్య సినిమా చూశారట కదా?
అవును. ఇటీవల నాగచైతన్య ‘అనుభవించు రాజా’ సినిమా చూశారు. ఆయనకు మా సినిమా బాగా నచ్చింది. సినిమా పూర్తయ్యాక.. శ్రీనుతో అరగంట సేపు మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పారు

కొన్ని ప్రయోగాలు చేశారు. మళ్ళీ పాత జోనర్ కి వచ్చారు. సేఫ్ గేమ్ అనుకోవచ్చా ? 
అదేంలేదు. మనం అదీ ఇదీ అని లెక్కలు వేసుకుంటే వర్కౌట్‌ కాదు. కథ బావుంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే.

సినిమాలో వినోదం మీ పాత్ర చుట్టే ఉంటుందా?
లేదు, పోసాని, సుదర్శన్, అజయ్ ఇలా చాలా మంది వున్నారు. అన్నీ పాత్రల్లో ఫన్ వుంటుంది. కథంతా నా పాత్ర చుట్టే తిరుతుంది కాబట్టి.. నా కామెడీ కాస్త ఎక్కువగా ఉంటుంది

హీరోయిన్ కశిష్‌ఖాన్‌ గురించి ?
తెలుగు రాకపోయిన చాలా బాగా నేర్చుకొని సొంతగా డైలాగులు చెప్పడానికి ప్రయత్నించింది. మంచి మనిషి. షూటింగ్‌ సమయంలో మేము చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం.  చాలా ప్రశాంతంగా వుంటుంది.

కొత్త సినిమా కబుర్లు ఏంటి?
స్టాండప్ రాహుల్ రెడీ అవుతుంది. మాస్ మహారాజా సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. మరిన్ని కథలు వింటున్నా.

మరిన్ని వార్తలు