Raja Raja Chora Review: ఈ చోరుడు, హృదయాలను దోచుకున్నాడా? లేదా?

19 Aug, 2021 10:22 IST|Sakshi
Raja Raja Chora Review
Rating:  

టైటిల్‌ : రాజ రాజ చోర
నటీనటులు :  శ్రీవిష్ణు, మేఘా ఆకాష్‌, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు : అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌
దర్శకత్వం : హసిత్‌ గోలి
సంగీతం :  వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ : వేద రమణ్‌ శంకరన్‌
ఎడిటింగ్‌: విప్లవ్‌
విడుదల తేది : ఆగస్ట్‌ 19,2021 

Raja Raja Chora

చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాగ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. యావరేజ్‌ నుంచి మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యంగ్‌ హీరో సెక్సెస్‌కి ‘గాలి సంపత్‌’ బ్రేక్‌ వేశాడు. దీంతో కాస్త వెనకడుగు వేసిన శ్రీవిష్ణు.. ఈ సారి ఎలాగైనా మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాలనే కసితో ‘రాజ రారజ చోర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రాజ రాజ చోర’ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడా లేదా?  రివ్యూలో చూద్దాం.
Raja Raja Chora Telugu Movie Rating

రాజ రాజ చోర కథేంటంటే

భాస్కర్‌ (శ్రీవిష్ణు) ఓ చిన్న దొంగ.  ఓ జిరాక్స్‌ షాపులో పని చేస్తూ అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం  తాను ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకొనే సంజన అలియాస్‌ సంజు(మేఘ ఆకాశ్‌)తో ప్రేమాయణం సాగిస్తాడు. అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయినప్పటికీ భాస్కర్‌ సంజనతో ఎందుకు ప్రేమాయణం సాగించాడు? తాను ప్రేమించిన వ్యక్తి సాఫ్టవేర్‌ ఇంజనీర్‌ కాదనీ, అతనికి పెళ్లై, బాబు కూడా ఉన్నాడని తెలిసిన తర్వాత సంజన పరిస్థితి ఏంటి? దొంగగా ప‌ట్టుబ‌డి పోలీసులకి చిక్కిన భాస్క‌ర్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అనేదే మిగతా కథ
Sree Vishnu Movie RRC Review

ఎవరెలా చేశారంటే?

ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. దొంగగా, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో అద్భుత నటనను కనబరిచాడు. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. హీరో భార్య విద్య పాత్రలో సునైనా ఒదిగిపోయింది. మధ్యతరగతికి చెందిన వివాహితగా ఆకట్టుకుంది. ఇక సంజూగా మేఘా ఆకాశ్‌ పర్వాలేదనిపించింది. పోలీస్ అధికారి విలియమ్‌ రెడ్డి పాత్రలో ర‌విబాబు  ఒదిగిపోయిన తీరు బాగుంది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. అవినీతి పోలీసు అధికారిగా అదరగొట్టేశాడు. అంజమ్మ పాత్రలో గంగవ్వ మెప్పించింది. తనదైన పంచులతో నవ్వులు పూయిచింది. శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌,  అజ‌య్ ఘోష్, త‌నికెళ్ల భ‌ర‌ణి  త‌దిత‌రులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 
Raja Raja Chora Movie Review by Sakshi

ఎలా ఉందంటే?

అవసరాల కోసం దొంగగా మారిన ఓ వ్యక్తి.. తన తప్పును తెలుసుకొని మంచి వాడిగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. మనసు మాట వినకుండా.. డబ్బు కోసం ఆశ పడి చేసే ఏ పనైనా తప్పే అనే సందేశాన్ని కామెడీ యాంగిల్‌లో చూపించాడు దర్శకుడు హసిత్‌ గోలి. దానికి కొంత ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి కథను నడిపించాడు. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్‌ హిసిత్‌ మాత్రం తన డెబ్యూ మూవీనే ఇలాంటి కొత్త తరహా కథను చెప్పాలనుకొనే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. అనుకున్నది తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. భాస్కర్‌, విద్యల సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం పెరుతుంది. అయితే కథను సాగదీస్తూ అసలు విషయాన్ని ఇంటర్వెల్‌ వరకు లాగడం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్‌ ముందు పోలీసులకు శ్రీవిష్ణు ప‌ట్టుబ‌డిన‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అంతేకాదు సెండాఫ్‌పై అంచనాలను పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథను నెమ్మదిగా సాగడం కాస్త మైనస్‌. కథను ఎమోషనల్‌గా డీల్‌ చేయడానికి స్కోప్‌ ఉన్నప్పటీ.. డ్రామాపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు దర్శకుడు. సెకండాఫ్‌లో భాస్కర్‌ దొంగతనం చేసే సీన్స్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, తనికెళ్ల భ‌ర‌ణి చెప్పే ప్ర‌వ‌చ‌నాల‌తో ముడిపెడుతూ క‌థ‌ని న‌డిపించిన విధానం బాగుంటుంది.

ఇక ఈసినిమాకు ప్రధాన బలం వివేక్‌ సాగర్‌ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సెకండాఫ్‌లో వచ్చే సిధ్‌ శ్రీరామ్‌ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేవిధంగా ఉంటుంది. వేద రమణ్‌ శంకరన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ విప్లవ్‌ తన కత్తెరకు ఇంకా చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు