Vijayendra Prasad: రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ హైస్కూల్‌ వరకూ చదివింది ఇక్కడే..

7 Jul, 2022 07:11 IST|Sakshi

కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్‌ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్‌ ఒకరు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్‌ స్వయానా పెదనాన్న కొడుకు.
చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం..

తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు.  వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్‌. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే  సాగింది. అనంతరం ఏలూరులో చదివారు.

1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు.

బాహుబలి..ఆర్‌ఆర్‌ఆర్‌ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్‌ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్‌ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. 

మరిన్ని వార్తలు