విడాకుల ప్రచారం: ‘నా భార్యను ఎంతో ప్రేమిస్తున్నా’

5 Sep, 2020 13:22 IST|Sakshi

‘నేను.. నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నా. కలిసి ఉంటేనే బంధం మరింత బలంగా ఉంటుంది’ అంటూ మోడల్‌ రాజీవ్‌ సేన్‌ తన వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టాడు. భార్య, నటి చారు అసోపాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి తామెంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. చారును ఎంతగానో మిస్సయ్యానని.. అందుకే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేశానంటూ భార్య పట్ల తనకున్న భావాలను వ్యక్తీకరించాడు. ఇక చారు సైతం భర్తను హత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేసి.. ‘‘నా భర్తను ప్రేమిస్తున్నా. నిన్నెంతో మిస్సయ్యాను’’ అంటూ ప్రేమను చాటుకున్నారు. (చదవండి: మరోసారి వార్తల్లోకెక్కిన స్టార్‌ జంట!)

దీంతో.. ‘‘మీరిలాగే కలకాలం సంతోషంగా కలిసి ఉండాలి’’ అంటూ ఈ జంట అభిమానులు కామెంట్ల రూపంలో తమ స్పందన తెలియజేస్తున్నారు. కాగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్‌ సేన్- చారు అసోపాల వివాహం గతేడాది జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. సన్నిహితుల సమక్షంలో గోవాలో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొన్ని నెలల తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో వెడ్డింగ్‌ ఫొటోలతో పాటు తాము కలిసి ఉన్న అన్ని ఫొటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. అంతేగాక ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు.

ఈ క్రమంలో వివాహ వార్షికోత్సవానికి ముందే రాజీవ్‌.. చారును ముంబైలో వదిలేసి ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. దీంతో వీరిద్దరు విడిపోతున్నారంటూ బీ-టౌన్‌లో వదంతులు వ్యాపించాయి. తొలుత ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈ స్టార్‌ జంట.. ఆ తర్వాత స్నేహితుల మాటల వల్లే తమ మధ్య దూరం పెరిగిందంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. విడిపోవడం ఖాయమనుకునేలా గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేలా విమర్శలకు దిగారు. అయితే అనూహ్యంగా మరోసారి కలిసి ఉన్న ఫొటోలు షేర్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మరిన్ని వార్తలు