నా నటన చూసి షాక్‌ అవుతారు

15 Feb, 2021 01:26 IST|Sakshi
భవానీ శంకర్, రాజేంద్రప్రసాద్, సాషా సింగ్‌

– రాజేంద్రప్రసాద్‌

‘‘క్లైమాక్స్‌’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను ఎప్పుడూ చేయని పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా నటన చూసి షాక్‌కు గురవుతారు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ‘డ్రీమ్‌’ ఫేమ్‌ భవానీ శంకర్‌. కె. దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృధ్వీ, శివ శంకర్‌ మాస్టర్, రమేష్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘క్లైమాక్స్‌’. కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై కరుణాకర్‌ రెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి నిర్మించారు.

ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ యఫ్‌.డి.సి.చైర్మన్‌ రామ్మోహన్‌ రావు, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మన సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశామనే దానికంటే, మన కంటెంట్‌ ఎంత మందికి రీచ్‌ అయింది అనేది ముఖ్యం. ‘క్లైమాక్స్‌’ సినిమా ప్రేక్షకులందరికీ రీచ్‌ అవ్వాలి.. అప్పుడే భవానీ శంకర్‌లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు’’ అన్నారు. భవాని శంకర్‌ మాట్లాడుతూ– ‘‘ రాజేంద్ర ప్రసాద్‌గారు గొప్ప నటుడు. 40 సంవత్సరాల నుండి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎస్‌.వి.రంగారావు తర్వాత నాకు రాజేంద్ర ప్రసాద్‌గారే కనిపిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్‌ సాషా సింగ్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్, నిద్వాన, కెమెరా: రవి కుమార్‌ నీర్ల.

మరిన్ని వార్తలు