మీ జ్ఞాప‌కాలు ఎప్ప‌టికీ స‌జీవ‌మే: ర‌జ‌నీ

25 Sep, 2020 16:42 IST|Sakshi

చెన్నై: ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేర‌న్న వార్త‌ను సినీ న‌టుల‌తో పాటు, అభిమానులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. వేల కొద్దీ పాట‌ల‌ను ఆల‌పించిన గొంతు ఇక మూగ‌బోయింద‌ని తెలిసి ఎవ‌రికీ నోట మాట రావ‌డం లేదు. నేడు(శుక్ర‌వారం) మ‌ధ్యాహ్నం 1.04 నిమిషాల‌కు బాలు ఈ లోకం నుంచి శాశ్వ‌త వీడ్కోలు తీసుకున్నార‌ని తెలిసి త‌ల్లడిల్లిపోతున్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని త‌మిళ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్వీట్ చేశారు. "చాలా ఏళ్లుగా సినిమాల్లో నాకు డ‌బ్బింగ్ చెప్పారు. మీ గొంతు, మీ జ్ఞాప‌కాలు నాతో ఎల్ల‌ప్ప‌టి‌కీ స‌జీవంగా ఉంటాయి. మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతాను" అంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో ఎస్పీ బాలు గురించి మాట్లాడిన‌ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (చదవండి: బాలు మరణం: ప్రముఖుల నివాళి)

మ‌రోవైపు గురువారం ఎస్పీ బాలును ఆఖ‌రుసారిగా పరామ‌ర్శించి వ‌చ్చిన ప్ర‌ముఖ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూడా మ‌ర‌ణ‌వార్త తెలిసి ఉద్వేగ‌భ‌రితుల‌య్యారు. బాలుతో క‌లిసి దిగిన ఫొటోల‌న్నింటినీ ఒక ద‌గ్గ‌ర చేర్చిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. కాగా ఎస్పీ బాలు.. సిప్పిక్కుల్ ముత్తు, మైఖెల్ మదన కామరాజు, భామనే సత్యభామనే, అభయ్, సత్యమే శివం, ముంబై ఎక్స్‌ప్రెస్, దశావతారం, మన్మథ బాణం అనే సినిమాల్లో క‌మ‌ల్ హాస‌న్‌కు డ‌బ్బింగ్ చెప్పారు. ర‌జ‌నీ కాంత్‌తో పాటు జెమిని గ‌ణేశ‌న్‌, న‌రేష్‌, సుమ‌న్‌, మోహ‌న్ లాల్‌, అనిల్ క‌పూర్‌, గిరీష్ క‌ర్నాడ్‌, టిను ఆనంద్, అర్జున్‌, ‌బాలకృష్ణ(అన్న‌మ‌య్య త‌మిళ డ‌బ్బింగ్‌) నాజర్‌ల‌కు డ‌బ్బింగ్ చెప్పారు. (చదవండి: గాన గంధర్వుడికి గాయనీమణుల నివాళులు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు