రజనీకాంత్ చిత్రానికి తమిళ రీమేక్.. అజిత్ అంత సాహసం చేస్తారా?

6 Feb, 2023 14:50 IST|Sakshi

చిత్రసీమలో హిట్‌ చిత్రాలను రీమేక్‌ చేయడం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా వచ్చిన కొన్ని చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. గతంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు విష్ణువర్ధన్‌ చేశారు. రజనీకాంత్‌ పాత్రలో అజిత్‌ నటించి హిట్‌ కొట్టారు.

తాజాగా మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రజినీకాంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రం బాషా. ఒక సాధారణ యువకుడు పరిస్థితుల ప్రభావంతో ఎలా అండర్‌ వరల్డ్‌ డాన్‌గా మారాడో..? తిరిగి మళ్లీ ఎలా మంచిగా మారి జన స్రవంతిలోకి కలిసిపోయాడు? అన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం టాలీవుడ్‌లోనూ రజనీకాంత్‌కు  స్టార్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు విష్ణువర్ధన్‌ కొన్ని మార్పులు చేసి రీమేక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులోనూ అజిత్‌ను కథానాయకుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్‌. 

కాగా తునివు చిత్రం తర్వాత అజిత్‌ తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ వైదొలిగారు. అందుకు కారణం కథలో అజిత్‌  చెప్పిన మార్పులకు ఈయన అంగీకరించ పోవడమేనని సమాచారం.

ఇప్పుడు తాజాగా అజిత్‌ చిత్రానికి మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తదుపరి విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో భాషా చిత్రానికి రీమేక్‌లో నటించడానికి అజిత్‌ మరోసారి సాహసం చేస్తారా? అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు