కోవిడ్‌ బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్‌ రూ. కోటి విరాళం

14 May, 2021 14:40 IST|Sakshi

కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు కోలీవుడ్‌ నడుంబిగించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజరోజుకు లక్షల్లో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సమయానికి బాధితులకు వైద్య సదుపాయం, ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్నారు. ఇక బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్‌ నటుడు శివ కుమార్లు కలిసి సీఎం స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్‌ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్‌ వనంగముడి, మామ ఎస్‌ఎస్‌ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్‌ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె భర్త విశాగన్‌ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక హీరో అజిత్‌ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌, హీరో ఉదయనిధి స్టాలిన్‌లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

మరిన్ని వార్తలు