మీ కుటుంబానికి ఉన్నారా స్నేహితులు?

28 Oct, 2021 00:28 IST|Sakshi
ప్రాణ స్నేహితుడు రాజ్‌ బహదూర్‌తో రజనీకాంత్‌

Rajinikanth Dadasaheb Phalke Award 2021: ‘నా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ నా స్నేహితుడు రాజ్‌ బహదూర్‌కు అంకితం అన్నాడు నటుడు రజనీ కాంత్‌. 50 ఏళ్ల నాటి స్నేహం వారిది. ఇవాళ్టికీ రజనీకాంత్‌ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మంచం మీద స్నేహితుడు పడుకుంటే తాను కింద పడుకుంటాడు.

కుటుంబాలు కేవలం తల్లి, తండ్రి, పిల్లలతో మనలేవు. స్నేహితులు కావాలి. గాఢమైన స్నేహాలే బతుకు నావలో సంతోషాన్ని, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్‌నీ ఇస్తాయి. మరి మనకు ఉన్నాయా అంతటి గట్టి స్నేహాలు. మన పిల్లలకు నేర్పిస్తున్నామా ఆ సంస్కారాలు?

‘ఒక మనిషికి అసలైన నష్టం ఏమిటంటే నిజమైన మిత్రుణ్ణి కోల్పోవడమే’ అని సూక్తి. సంపదలు ఎన్ని రకాలైనా ‘స్నేహ సంపద’ వాటిలో ఉంది. స్నేహితుల్ని కోల్పోవడం అంటే సంపదను శాశ్వతంగా కోల్పోవడం. ‘నీ స్నేహితులెవరో చెప్పు... నువ్వెవరో చెప్తా’ అనేది ఎందుకంటే ఆ స్నేహితుల సంఖ్యను, వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించవచ్చు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు.

కాని కళ్లు తడవకుండా, ఆ సమయంలో పక్కనే స్నేహితుడు లేకుండా జీవితాన్ని దాటడం కష్టం. స్నేహ సంబంధాలు నిలబెట్టు కోవడానికి సమయం ఇస్తున్నామా? స్నేహితులను కోల్పోతే మళ్లీ పొందగలమా? ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్‌’ అనే మాట ఉంది. మనకిప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఎందరు మన ఇంటికి వచ్చి ఎందరి ఇంటికి మనం వెళ్లగలిగేలా ఉన్నాము. చెక్‌ చేసుకోవడం తప్పనిసరి.  స్నేహంలో ఉండే ఆనందమే బలం. ఆయుష్షు.

రజనీకాంత్‌ మరియు అతడు
మొన్న ఢిల్లీలో రజనీకాంత్‌ తన నట జీవితానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు కె.బాలచందర్‌తో పాటు స్నేహితుడు రాజ్‌ బహదూర్‌కు కూడా ఇచ్చాడు. రజనీకాంత్‌కు బెంగళూరులో రాజ బహదూర్‌ అనే స్నేహితుడు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్నేహం... స్నేహానికి ఉండే విలువ చర్చకు వచ్చాయి.

‘నాలోని నటుణ్ణి రాజ్‌ బహదూర్‌ గుర్తించి నన్ను మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించాడు’ అని రజనీకాంత్‌ అన్నాడు. ఒక స్నేహితుడు అన్న మాట, అతని ప్రోత్సాహమే ఇవాళ దేశానికి రజనీకాంత్‌ వంటి సూపర్‌స్టార్‌ని ఇచ్చింది. అందుకే రజనీకాంత్‌ ఆ స్నేహం పట్ల కృతజ్ఞతతో... ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు.

ఎప్పటి స్నేహం?
1970 నాటి సమయం. అప్పుడు రజనీకాంత్‌ బెంగళూరులో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌గా ఉన్నాడు. బస్‌ కండక్టర్‌గా కర్ణాటక ఆర్‌.టి.సిలో ఉద్యోగంలో చేరాడు. అతని బస్‌ నంబర్‌ 10 ఏ. మెజెస్టిక్‌ నుంచి శ్రీనగర్‌ స్టాప్‌ల మధ్య తిరిగేది. దాని డ్రైవర్‌ రాజ్‌ బహదూర్‌.  రాజ్‌ బహదూర్‌ రజనీ కన్నా ఏడేళ్లు పెద్దవాడు. కాని వారికి స్నేహం కుదిరింది. ‘ఆ సమయంలోనే రజనీకాంత్‌లో మంచి స్టయిల్‌ ఉండేది.

ప్రయాణికులకు చిల్లర ఇవ్వాల్సి వస్తే కాయిన్‌ ఎగరేసి ఇచ్చేవాడు. ఏ కార్యక్రమాలు జరిగినా స్టేజ్‌ మీద నాటకం వేసేవాడు. అందరికంటే బాగా నటించేవాడు.’ అని 77 ఏళ్ల రాజ్‌ బహదూర్‌ గుర్తు చేసుకున్నాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చామరాజ్‌నగర్‌లోనే ఉంటున్నాడు. రజనీకాంత్‌ అప్పట్లో దానికి దగ్గరగా ఉండే హనుమంతనగర్‌ లో ఉండేవాడు. డ్యూటీ సమయాల్లోనూ డ్యూటీ లేనప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవారు.

స్నేహితుడే దారి
రజనీకాంత్‌ను సినిమాల్లో చేరమని రాజ్‌ బహదూర్‌ శత పోరు పెట్టాడు. కాని ఉద్యోగాన్ని వదిలి మద్రాసు వెళ్ళడం రజనీకి పెద్ద రిస్క్‌. నీకెందుకు నేనున్నా అన్నాడు రాజ్‌ బహదూర్‌. ఆ రోజు ల్లో రాజ్‌ బహదూర్‌ జీతం 400. అందులో 200 రజనీకాంత్‌కు పంపేవాడు. రజనీకాంత్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న రోజులకు, స్ట్రగుల్‌ అయిన రోజులకు రాజ్‌ బహదూర్‌ పంపిన డబ్బే పెద్ద ఆధారం.

‘ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో కోర్స్‌ పూర్తయ్యాక ముగింపు ఫంక్షన్‌కు కె.బాలచందర్‌ చీఫ్‌ గెస్ట్‌. ఆ టైమ్‌లో ఆయన రజనీకాంత్‌ని చూసి ‘తమిళం నేర్చుకో’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. రజనీ నా దగ్గరకు వచ్చాడు. బాలచందర్‌ ఈ మాట అన్నాడ్రా అన్నాడు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి నాతో తమిళంలోనే మాట్లాడు అన్నాడు. నేను తమిళం మాట్లాడుతూ తమిళం నేర్చుకోవడంలో సాయం చేశాను’ అన్నాడు రాజ్‌ బహదూర్‌.

కృష్ణ–కుచేల
నిజానికి రజనీకాంత్‌ ఇప్పుడు కృష్ణుడు. కాని రాజ్‌ బహదూర్‌ దగ్గర ఎప్పుడూ కుచేలుడిగానే ఉంటాడు. ఫోన్లు చేయడు. మెసేజ్‌లు పెట్టడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాజ్‌ బహదూర్‌ ఇంటికి వచ్చి బెల్లు కొడతాడు. ఆర్‌టిసిలో రిటైర్‌ అయ్యి తమ్ముడి కుటుంబంతో సొంత ఇంట్లో జీవిస్తున్న రాజ్‌ బహదూర్‌ దగ్గర రజనీ కాంత్‌ కోసమే ఎప్పుడూ ఒక గది సిద్ధంగా ఉంటుంది.

ఆ గదిలో ఒక సింగిల్‌ కాట్‌ ఉంటుంది. రాజ్‌ బహదూర్‌ దానిమీద రజనీకాంత్‌ కింద నిద్రపోతారు. రజనీకాంత్‌ వచ్చాడంటే స్నేహితులిద్దరినీ ఆ గదిలో వదిలి కుటుంబ సభ్యులు ఏమీ ఎరగనట్టుగా ఉండిపోతారు. ఇక రేయింబవళ్లు వాళ్ల కబుర్లు సాగుతాయి. రజనీకాంత్‌ ఒక్కోసారి రాజ్‌ బహదూర్‌ దగ్గర వారం పది రోజులు ఉండిపోతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక మామూలు మనుషుల్లా బెంగళూరు రోడ్ల మీద తిరుగుతారు.

కొనసాగే బంధం
సినిమా రంగంలోని కృత్రిమత్వం నుంచి పారిపోవడానికి రజనీకాంత్‌ తన స్నేహాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. ఒక్క రాజ్‌ బహదూర్‌ దగ్గర మాత్రమే రజనీ మామూలు మనిషిలా ఉండగలడు.

మనల్ని భ్రమల్లో నుంచి, అహంలో నుంచి బయటపడేలా చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మన పిల్లలకు ‘మావయ్యగానో బాబాయిగానో’ ఉంటూ మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి స్నేహాలు పొందడం కష్టం కాదు. కాపాడుకోవడమే కష్టం. అందుకు ప్రయత్నించినవాళ్లే ధన్యులు.

మరిన్ని వార్తలు