Rajinikanth: బాబా కోసం తలైవా డబ్బింగ్‌.. రీరిలీజ్‌కు అడ్వాన్స్‌ టెక్నాలజీతో రీషూట్‌

29 Nov, 2022 08:31 IST|Sakshi

తమిళ సినిమా: గతంలో విడుదలైన చిత్రాలను రీమేక్‌ చేయడం, రిలీజ్‌ చేయడం కొత్తేమీ కాదు. అయితే రీ షూట్‌ చేయడం, ఆధునిక టెక్నాలజీతో కొత్త హంగులను అద్దడం అరుదైన విషయమే. తాజాగా రజనీకాంత్‌ చిత్రానికి అదే జరుగుతోంది. ఆయన నటించిన చిత్రాలకు ఎప్పటికీ క్రేజ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా రెండు దశాబ్దాల క్రితం రజినీకాంత్‌ కథ కథనాన్ని అందించి కథానాయకుడిగా నటించిన చిత్రం బాబా. దైవానుగ్రహాన్ని జోడించి కమర్షియల్‌ ఫార్మేట్‌లో రూపొందింన బాబా చిత్రంలో నటి మనీషా కోయిరాలా నాయకిగా నటించారు.

సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎందుకనో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఇది రజనీకాంత్‌కు బాగా నచ్చిన కథ. అందుకే దీన్ని ఆయన వదలలేకపోయారు. చిత్రంలోని లోపాలను పునః పరిశీలన చేసుకుని వాటిని భర్తీ చేసే విధంగా తాజాగా కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మళ్లీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన రీషట్‌ చేసిన సన్నివేశాలకు డబ్బింగ్‌ పూర్తి చేశారు. కాగా చిత్ర ట్రైలర్‌ చసిన తర్వాత ఏమైనా కొత్తగా సంగీత బాణీలను సమకూర్చాలా అన్న ఆలోచనలో సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఉన్నట్లు సమాచారం.

కాగా బాబా చిత్రాన్ని సరికొత్త హంగులతో రజినీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర వర్గాలు ముందు భావించారట. అయితే ఎప్పుడైతే బాబా చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త హంగులు దిద్దుతున్నట్లు ప్రకటించారో అప్పటి నుంచి అభిమానుల్లో వస్తున్న స్పందనను చూసి ఈ చిత్రాన్ని తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది రజనీకాంత్‌ అభిమానులకు నిజంగా ఆనందాన్ని కలిగించే విషయమే అవుతుంది. కాగా రజనీకాంత్‌ ప్రస్తుతం సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న జైలర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రానుంది. తర్వాత విను చక్రవర్తి దర్శకత్వంలో ఒక చిత్రం, ఆయన పెద్ద కూతురు దర్శకత్వం వహిస్తున్న లాల్‌ సలాం చిత్రంలో (అతిథి పాత్రలో) నటించనున్నారు. ఈ రెండు చిత్రాలను లైక సంస్థ నిర్మించడం విశేషం.

మరిన్ని వార్తలు