సుధా కొంగర దర్శకత్వంలో రజనీకాంత్‌ సినిమా!

25 Apr, 2023 10:34 IST|Sakshi

ఏడు పదుల వయసు పైబడిన సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈయనతో చిత్రాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈయన ఏక కాలంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న జైలర్‌ చిత్రం. కాగా రెండవది ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న లాల్‌ సలాం చిత్రం. ఇందులో రజనీకాంత్‌ అతిథిగా ఓ పవర్‌ఫుల్‌ పాత్రను పోషిస్తున్నారు.

కాగా, ఈ రెండు చిత్రాల షూటింగులను రజనీకాంత్‌ పూర్తి చేశారు. తదుపరి జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ టీజే.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది రజనీకాంత్‌ నటించనున్న 170వ చిత్రం అవుతుంది. దీన్ని లైకా ప్రొడక్షన్స్‌ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా రజినీకాంత్‌ నటించే 171 వ చిత్రానికి కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కారణం ఇద్దరు దర్శకులు, పలువురు నిర్మాతలు క్యూలో ఉండటమే. రజినీకాంత్‌ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని నిర్మించడానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నారని, అందులో విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ కూడా ఉస్‌ట్లు ప్రచారం జరుగుతోంది.

(చదవండి: రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!)

తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఇరుదు చుట్రు, సూరరైపోట్రు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వహించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర కూడా రజనీకాంత్‌ను దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే రజనీకాంత్‌కు కథను వినిపించినట్లు అది ఆయనకు నచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా దీన్ని కేజీఎఫ్‌ చిత్రం ప్రేమ్‌ హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం బెంగళూరులోని ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్‌ ను దర్శకురాలు సుధా కొంగర, హోంబలి చిత్ర నిర్మాత కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  

మరిన్ని వార్తలు