Rajinikanth Jailer Movie: ఢిల్లీకి రజనీకాంత్‌..10 రోజుల పాటు అక్కడే!

7 Aug, 2022 09:59 IST|Sakshi

జయాపజయాలకు అతీతుడు రజనీకాంత్‌. నటుడుగా తన 50 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను చూశారు. ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈయన సక్సెస్‌ అందుకుని చాలా కాలం అయినా క్రేజ్‌ ఇంచి కూడా తగ్గలేదు. ఆయన నూతన చిత్రం అనౌన్స్‌మెంట్‌ వచ్చిన రోజు అభిమానులకు పండుగ రోజుగా మారిపోతున్న పరిస్థితి. అలాంటి రజనీకాంత్‌ తాజాగా నటిస్తున్న చిత్రం జైలర్‌. టైటిలే పవర్‌ఫుల్‌గా ఉంది కదా! చిత్ర కథ కూడా అంత కంటే పవర్‌పుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. గతంలో విజయ్‌ హీరోగా బీస్ట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన నెల్సన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

(చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్!)

సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్, నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్, ప్రియాంక అరుణ్‌ మోహన్, రమ్యకృష్ణ, యోగిబాబు, పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అలాగే రాఖి, తరమణి చిత్రాలు ఫేమ్‌ వసంత రవి ఒక కీలక పాత్రను పోషించనున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ కేశాలంకరణ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి మేకోవర్‌గా చేసిన ఆలిమ్‌ హాకింగ్‌ పని చేస్తున్నారు.

ఇది రజనీకాంత్‌ నటిస్తున్న 169వ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా ఆయన మొట్టమొదటిసారిగా ఇందులో జైలర్‌గా నటిస్తుండటం విశేషం. కాగా చిత్రం కోసం హైదరాబాదులో భారీ సెట్‌ను వేస్తున్నారు. అయితే ముందుగా చెన్నైలో షూటింగ్‌ను నిర్వహించి ఆ తరువాత కారైకాల్‌ సముద్రతీర ప్రాంతాల్లో కొంత భాగాన్ని చిత్రీకరించి ఆ తరువాత హైదరాబాదులో షూటింగ్‌ను నిర్వహించడానికి చిత్ర వర్గాలు ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ సడన్‌గా శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ జైలర్‌ చిత్రానికి సంబంధించిన 10 రోజుల షూటింగ్‌ నిర్వహించి చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు