గెట్‌ సెట్‌ గో అంటున్న స్టార్‌ హీరోలు.. ఆగస్ట్‌ తర్వాత ఫుల్‌ బీజీ

17 Jul, 2022 09:30 IST|Sakshi

ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోతారు హీరోలు. అయితే ప్రస్తుతం కొందరు టాప్‌ స్టార్స్‌ తమ సినిమా విడుదలై కొన్ని నెలలవుతున్నా తదుపరి చిత్రం సెట్స్‌లోకి అడుగుపెట్టలేదు. మరి.. ఈ హీరోలు ‘గెట్‌ సెట్‌ గో’ అంటూ కొత్త సినిమా షూటింగ్‌లోకి ఎప్పుడు ఎంటర్‌ అవుతారు అంటే.. ‘వచ్చే నెల’ అని తెలుస్తోంది. ఆగస్ట్‌ తర్వాత నుంచి ఫుల్‌ బిజీగా కొత్త చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొననున్న హీరోల గురించి తెలుసుకుందాం.

‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రం తర్వాత మేకప్‌ వేసుకుని హీరోగా రజనీకాంత్‌ సెట్స్‌లోకి అడగుపెట్టనున్న చిత్ర‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్‌గా, రమ్యకృష్ణ, ప్రియాంకా అరుల్‌ మోహనన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఆరంభించడానికి చిత్రం యూనిట్‌ ఏర్పాట్లు చేస్తోందని తెలిసింది. ప్రస్తుతం ఆ స్టూడియోలో సెట్‌ నిర్మాణం జరుగుతోందని తెలిసింది.

మరోవైపు కొత్త సినిమా సెట్స్‌లో బాలకృష్ణ అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సెంటిమెంట్, యాక్షన్‌ను సమపాళ్లల్లో మిక్స్‌ చేసారట అనిల్‌ రావిపూడి. ఇంకోవైపు దాదాపు పన్నెండేళ్ల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న సంగతి  తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను  ఆగస్టులో ఆరంభించనున్నట్లుగా ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మూడోసారి రాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో హీరో) వంటి సక్సెస్‌ఫుల్‌ హిట్‌ తర్వాత హీరో ఎన్టీఆర్‌ చేయనున్న తర్వాతి సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ‘జనతా గ్యారేజ్‌’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కావాల్సింది. అయితే సెప్టెంబరులో చిత్రీకరణను ఆరంభించేలా కొరటాల అండ్‌ కో సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

మరోవైపు ‘పుష్ప’ సక్సెస్‌తో మాంచి జోరు మీద ఉన్నారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం హాలిడేలో భాగంగా లండన్‌లో ఉన్నారు అల్లు అర్జున్‌. వచ్చిన తర్వాత ‘పుష్ప’ చిత్రంలోని రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌లో పాల్గొంటారు. ‘పుష్ప’ చిత్రంలో తొలి భాగం అయిన ‘పుష్ప: ది రైజ్‌’ సూపర్‌ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సుకుమార్‌ అంతకు మించిన కథను ‘పుష్ప: ది రూల్‌’ కోసం రెడీ చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.

వీరితో పాటు శర్వానంద్, వరుణ్‌ తేజ్‌ల కొత్త సినిమాల రెగ్యులర్‌ షూటింగ్స్‌ కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో లండన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. మరోవైపు శర్వానంద్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా రానుంది. 

మరిన్ని వార్తలు