ఏడు పదుల వయసులోనూ దూసుకెళ్తున్న రజనీ.. మరో రెండు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌

8 Oct, 2022 01:06 IST|Sakshi

యాభై ఏళ్ల కెరీర్‌లో రజనీకాంత్‌ నూటయాభై చిత్రాలకు పైగా చేశారు. ప్రస్తుతం 169 చిత్రంగా ‘జైలర్‌’లో నటిస్తున్నారు. ఏడు పదుల వయసులో ఉన్న సూపర్‌ స్టార్‌ సూపర్‌ స్పీడ్‌ మీద ఉన్నారు. ‘జైలర్‌’లో నటిస్తూనే మరో రెండు చిత్రాలు అంగీకరించారట. ఆ విశేషాల్లోకి వస్తే...

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జైలర్‌’. ఆగస్ట్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభమైంది. రజనీ ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీ స్టయిలిష్‌ జైలర్‌గా కనిపించనున్నారని లుక్‌ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిపోతుంది. ఈలోపు తన రెండు కొత్త చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారట రజనీకాంత్‌. అయితే ఈ రెండు చిత్రాలను ఒకే సంస్థ నిర్మించనుండటం విశేషం.

లైకాతో మళ్లీ...  రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘2.0’ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ రజనీతో ‘దర్బార్‌’ కూడా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో రజనీకి, లైకాకి మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే రజనీతో మరో రెండు సినిమాలు నిర్మించాలనుకుని సూపర్‌ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుందట లైకా సంస్థ. ఇటీవల మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ని లైకా సంస్థనే విడుదల చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి  రజనీ ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. లైకా సంస్థకు రజనీ చేయనున్న చిత్రాల దర్శకులు కూడా దాదాపు ఖరారయినట్లే. ఒకరు సిబి చక్రవర్తి, మరొకరు దేసింగు పెరియస్వామి.  

యువదర్శకులతో...  తొలి చిత్రం ‘డాన్‌’ (2022)తో సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నారు సిబి చక్రవర్తి. ఈ యువదర్శకుడికి రజనీ చాన్స్‌ ఇవ్వడం విశేషం. ఇక మరో దర్శకుడు దేసింగు పెరియస్వామి కూడా యువ దర్శకుడే. ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌’ (2020) వంటి హిట్‌ చిత్రంతో పెరియస్వామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా రిలీజైంది. పెరియస్వామికి కూడా రజనీ చాన్స్‌ ఇచ్చారట. ఇలా ఒకే బేనర్లో ఇద్దరు అప్‌కమింగ్‌ డైరెక్టర్లతో రజనీ చేయనున్న చిత్రాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు