Rakul Preet Singh: అది మన దురదృష్టం.. మనుషుల్లో అది కూడా ఒక భాగమే: రకుల్

12 Oct, 2022 14:02 IST|Sakshi

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపంచనున్నారు. ఛత్రివాలి మూవీలో కండోమ్ టెస్టర్‌గా ఆమె కనిపించనుండగా.. బాలీవుడ్‌ నటుుడు ఆయుష్మాన్ ఖురానా మేల్ గైనకాలజిస్ట్‌ పాత్రలో నటిస్తున్న 'డాక్టర్‌ జి' చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఇలాంటి విభిన్నమైన పాత్రలపై ఆమె తల్లిదండ్రులు ఎలా స్పందించారో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. డాక్టర్ జి, ఛత్రివాలి చిత్రాల్లో పాత్రలపై ఆమె తల్లిదండ్రులు అభ్యంతకరం వ్యక్తం చేశారన్న వార్తలను ఆమె ఖండించింది.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. 'ఆ వార్తలు నిజం కాదు. నా తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేం డాక్టర్ జి సినిమాలో పురుష గైనకాలజిస్ట్ గురించి చూపించబోతున్నాం. మనదేశంలో దీనిపై నిషేధం ఉండటం దురదృష్టకరం. కానీ గణాంకాల ప్రకారం దేశంలోని అత్యుత్తమ గైనకాలజిస్ట్‌లలో కొందరు మగ వైద్యులు కూడా ఉన్నారు. మన శరీరంలోని గుండె, మెదడు వ్యవస్థల్లాగే పునరుత్పత్తి భాగాన్ని చూడాలి. ఎందుకు భిన్నంగా చూస్తున్నారు. మీకు చికిత్స చేయడమే వైద్యుని పని. అది ఆడ, మగ అనేది ఇక్కడ ముఖ్యం కాదు' అంటూ చెప్పుకొచ్చింది. 

ఛత్రివాలి సినిమాను ప్రస్తావిస్తూ.. 'నా తల్లిదండ్రులు ఇందులో నటించడం గొప్ప ఆలోచనగా భావించారు. ఒక అమ్మాయి కండోమ్ ఫ్యాక్టరీలో పని చేయడం కొత్త విషయమేమి కాదు. మీకు కొత్తగా అనిపించినా ఇవన్నీ కుటుంబ కథా చిత్రాలే.  మీరు అందరితో కలిసి చూడగలిగే సినిమాలే. ఈ సినిమాల్లో మిమ్మల్ని భయపెట్టేలా  సన్నివేశాలు లేవు. ఎక్కువ మంది ప్రేక్షకుల కోసం సినిమా తీయడం చాలా గొప్ప విషయం' అంటూ వివరించింది. కాగా రకుల్ నటించిన డాక్టర్‌ జి సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. 

మరిన్ని వార్తలు