ఎన్‌సీబీ అధికారుల హెచ్చరికలు.. మాట మార్చిన రకుల్‌

24 Sep, 2020 10:46 IST|Sakshi

బాలీవుడ్‌లో కలకలం రేపిన‌ డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి  దీపికా పదుకోనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు ఎలాంటి నోటిసులు అందలేదంటుంది రకుల్‌ ప్రీత్‌. హైదరాబాద్‌లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్‌సీబీ పంపిన సమన్లు అందలేని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ ప్రీత్‌ మేనేజర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు ఇంకా సమన్లు అందలేదని తెలిపారు. ఒక యాడ్‌ ఫిల్మ్‌ షూట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన రకుల్‌ బుధవారం రాత్రి ముంబై వెళ్లారు. అయితే ఆమె వ్యాఖ్యలను ఎన్‌సీబీ ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘ఆమెకు సమన్లు జారీ చేశాం.. తను ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించాము. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. పైగా ఇది కేవలం ఒక సాకు.. ఆమె ఈ రోజు దర్యాప్తుకు హాజరు కాలేదు’ అని తెలిపారు. 

అంతేకాక ‘రకుల్ ప్రీత్ మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆమె హైదరాబాద్‌లో ఉందా లేక ముంబైలో ఉన్నారా అనే విషయం మాకు తెలియదు. ఒకవేళ ఆమె ముంబైలో ఉంటే.. హెచ్ అండ్ ఎం లేదా గార్డెన్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారా అనే విషయం తెలియదు.  ఎందుకంటే మూడు నెలల క్రితం ఆమె హెచ్ అండ్ ఎం అపార్ట్‌మెంట్‌కు మారింది. మేము ఆమెకు వాట్సాప్‌లో కూడా సమన్లు పంపించాము. ఒకవేళ రేపు కూడా ఆమె విచారణకు హాజరుకాకపోయినా.. ఏవైనా సాకులు చెప్పినా రకుల్‌కి నాన్‌ బెయిలబుల్‌ సమన్లు జారీ చేస్తాం’ అని ఎన్‌సీబీ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో సమన్లు అందలేదంటూ ప్రకటన విడుదల చేసిన రకుల్‌ తాజా హెచ్చరికల నేపథ్యంలో సమన్లు అందినట్లు ప్రకటించడం గమనార్హం.

డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకోనెలను కూడా ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించడానికి పిలిచింది. రోజు (సెప్టెంబర్ 24) శ్రుతి మదీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్‌లు ఎన్‌సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న.. సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. (చదవండి: నా పరువు తీస్తున్నారు!)

మరిన్ని వార్తలు