శంకర్‌- రామ్‌చరణ్‌ సినిమా; పది కోట్ల పాట?

17 Nov, 2022 01:45 IST|Sakshi

దర్శకుడు శంకర్‌ సినిమాల్లో సాంగ్స్‌ విజువల్స్‌ పరంగా, లొకేషన్స్‌ పరంగా చాలా గ్రాండియర్‌గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్‌ మరో గ్రాండియర్‌ సాంగ్‌ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్‌ పది కోట్ల బడ్జెట్‌తో పాట ప్లాన్‌ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ న్యూజిల్యాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ షెడ్యూల్‌ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్‌చరణ్, హీరోయిన్‌ కియారా అద్వానీలపై గ్రాండ్‌గా డ్యూయట్‌ సాంగ్‌ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్‌ను కేటాయించారట. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం.

పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతదర్శకుడు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు