Kalabhairava: వారి వల్లే ఆస్కార్‌ వేదికపై పాడా.. మండిపడ్డ తారక్‌, చరణ్‌ ఫ్యాన్స్‌

17 Mar, 2023 10:19 IST|Sakshi

మంచి ట్యూన్‌ పడితే పాట దానంతటదే వస్తుంది. కానీ ఆ పాట అందరికీ అర్థమవుతూనే ప్రజల మనసులో చోటు సంపాదించుకోవాలంటే మంచి లిరిక్స్‌ ఉండాలి. ఈ పాటకు ప్రాణం పోయాలంటే దీన్ని అద్భుతంగా పాడే సింగర్స్‌ కావాలి. తెరపై మెరుగ్గా కనిపించాలంటే స్టేజీ దద్దరిల్లేలా స్టెప్పులేసే డ్యాన్సర్లు కావాలి. ఇవన్నీ నాటు నాటు పాటకు సరిగ్గా సరిపోయాయి. కీరవాణి సంగీతం, చంద్రబోస్‌ లిరిక్స్‌.. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ గాత్రం.. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ.. తారక్‌, చరణ్‌ డ్యాన్స్‌ అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి కాబట్టే అందరికీ తెగ నచ్చేసింది. ఆస్కార్‌ సైతం మన ఒడిలో వచ్చి చేరింది. బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ కేటగిరీలో అకాడమీ అవార్డు సాధించడంపై తాజాగా సింగర్‌ కాలభైరవ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు.

'RRRకు ఆస్కార్‌ రావడం, అంత పెద్ద వేదికపై లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇవ్వడం.. నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఆ వేదికపై పాడానంటే అందుకు డైరెక్టర్‌ రాజమౌళి, నాన్న(కీరవాణి), కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ.. వీళ్లంతా ముఖ్య కారణం. వీళ్ల కృషి వల్లే ఆ పాట ప్రపంచం నలుమూలలకూ వెళ్లి అందరితో స్టెప్పులేయించింది. వారు లేకుంటే ఈ అందమైన అనుభూతి పొందే అవకాశం నాకు దక్కేదే కాదు. ఆర్‌ఆర్‌ఆర్‌లో పాలు పంచుకునే ఛాన్స్‌ ఇచ్చినందుకు నేను అదృష్టవంతుడిని' అని రాసుకొచ్చాడు కాలభైరవ.

అందరికీ క్రెడిట్‌ ఇచ్చావు కానీ హీరోలు ఏం చేశారు? అంటే నీ ఫ్యామిలీ మాత్రమే గొప్పనా? తారక్‌, చరణ్‌ డ్యాన్స్‌ లేకపోయుంటే ఆ పాట అంతదూరం వెళ్లేదే కాదు అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో కాలభైవర తన పోస్ట్‌పై వివరణ ఇచ్చాడు. 'తారక్‌, చరణ్‌ అన్నల వల్లే నాటు నాటు పాట ఇంత సక్సెస్‌ అయిందన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నేను కేవలం అకాడమీ వేదికపై పాడటానికి సహకరించినవారి గురించి మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించాను తప్ప అంతకుమించేమీ లేదు. కానీ ఇది మీకు వేరేలా అర్థమైంది. ఇది తప్పుగా వెళ్లినందుకు నన్ను క్షమించండి' అని ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు