Ram Charan: 'ఇప్పటికీ అలాగే ఉంటుంది,అందుకు రాజమౌళికి ధన్యవాదాలు'..

7 Apr, 2022 13:46 IST|Sakshi

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం​ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టింది. కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచి ఓ అంశంపై మాత్రం సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది.

ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ కంటే రామ్‌చరణ్‌ పాత్రను ఎలివేట్‌ చేశారని, దీంతో తారక్‌ కంటే చరణ్‌ పాత్ర డామినేటింగ్‌గా ఉందంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ మీట్‌లో ఇదే అంశంపై ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించింది. ఎన్టీఆర్‌ కంటే చరణ్‌ ఎక్కువ మార్కులు కొట్టేశాడని అంటున్నారు అని అడగ్గా.. రామ్‌చరణ్‌ స్పందిస్తూ.. 'ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. డామినేషన్‌ అన్న పదాన్ని నేను నమ్మను కూడా. అందులో నిజం లేదు.

మేం ఇద్దరం బాగా చేశాం. తారక్‌ ఫెంటాస్టిక్‌. అతడితో కలిసి పనిచేయడం ఎంజాయ్‌ చేశా. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అతడితో చేసిన ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు.  తారక్‌పై నా  ప్రేమ అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ చేసిన కామెంట్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు