RGV On KCR Biopic: లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించను: ఆర్జీవీ

4 Jun, 2022 08:23 IST|Sakshi

Ram Gopal Varma About KCR Biopic In Kondaa Movie Trailer Launch 2022: ‘‘నేను విజయవాడలో చదువుకున్నాను. విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు చేశాను. అయితే తెలంగాణ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ కొండా మురళి, కొండా సురేఖల గురించి తెలుసుకున్నప్పుడు వీరిపై సినిమా తీయాలనిపించి వారిని అడిగాను. తన తల్లిదండ్రుల జీవితాల ఆధారంగా సినిమా కాబట్టి నిర్మాతగా ఉంటానని సుష్మిత అడిగారు. కొండా మురళి, కొండా సురేఖల జీవితాల్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ కొంత భాగాన్ని మాత్రమే నేను సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. నేను ఏ బయోపిక్‌ తీసినా ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపించను. ‘కొండా’ (Kondaa Movie) రెస్పాన్స్‌ను బట్టి ప్రీక్వెల్, సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తాను. కేసీఆర్‌గారి బయోపిక్‌ (KCR Biopic) ఆలోచన ఉంది కానీ ఎప్పుడో చెప్పలేను’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. 

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొండా’. కొండా మురళి పాత్రలో త్రిగుణ్ (అదిత్‌ అరుణ్‌), కొండా సురేఖ పాత్రలో ఐరా మోర్‌ నటించారు. కొండా సుష్మితా పటేల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా కొత్త ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అనంతరం కొండా సుష్మిత మాట్లాడుతూ.. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం ‘కొండా’ సినిమా తీయలేదు. సినిమా తీస్తేనే గెలుస్తారని లేదు. అమ్మానాన్నల (కొండా మురళి, కొండా సురేఖ) ప్రస్థానాలు అంత ఈజీగా సాగలేదు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వీరి కథ అందరికీ తెలియాలనే కొండా సినిమాను నిర్మించాను. అలాగే యువత రాజకీయాల్లోకి రావాలన్నది మరో కారణం’’ అని తెలిపారు. 

చదవండి: ఈసారి కొట్టా.. చంపేస్తా.. ఆసక్తిగా 'కొండా' రెండో ట్రైలర్‌..

‘‘నేను హైదరాబాద్‌లో పెరిగాను. కానీ వరంగల్‌ గురించి, అక్కడి రాజకీయాల గురించి తెలీదు. ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. ఇప్పటివరకు 17 సినిమాలు చేశాను. అన్ని సినిమాలు డబ్బులు తీసుకువచ్చాయి’’ అని త్రిగుణ్‌ పేర్కొన్నాడు. ‘‘సురేఖగారి పాత్రలో నటించగలనని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని ఐరా మోర్‌ తెలిపింది.   

మరిన్ని వార్తలు