RGV: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

1 Dec, 2021 15:38 IST|Sakshi

Ram Gopal Varma Condolence On Sirivennela Sitaramasastry: టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ గర్వపడే రచయితల్లో ఒకరిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు  తీరని లోటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు వేలకుపైగా పాటలు రాసిన ఆయనకు పలువురు దర్శకులు, హీరోలు, సంగీత దర్శకులతో అమితమైన అనుబంధం ఉంది. అలాంటి వారిలో రామ్‌  గోపాల్‌ వర్మ ఒకరు. రామ్‌ గోపాల్‌ వర్మకు సిరివెన్నెలపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. వర్మ తొలిచిత్రం శివలో అన్ని పాటలు సీతారామ శాస్త్రితోనే రాయించారు.  శివ సినిమాలోని 'బోటని పాఠముంది.. మ్యాటనీ ఆట వుంది' అనే పాట అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలోను సిరివెన్నెలతో పాటలు రాయించుకోవడం మాత్రం మానలేదు. 

ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్‌ గోపాల్ వర్మ. 'శివ చిత్రం చేస్తున్నప్పుడు కవిత్వం బుకీష్‌ వర్డ్స్‌ లేకుండా కాలేజ్‌ విద్యార్థులు మాట్లాడుకునేలా పదాలతో సాంగ్‌ రాయమని అడిగితే రెండు మూడు సెకన్లలో 'బోటని పాఠముంది' అని మొదలుపెట్టారని వర్మ గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి మెమోరీస్‌కి వెళ్తే ఎన్నో పాటలు ఉన్నాయన్నారు. ఆయన మరణించడం నిజంగా షాకింగ్‌గా ఉందన‍్నారు.

'అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోతారు. కానీ ముందు తరాలకు ఒక మార్గదర్శకునిగా రచయితలకు ఒక గురువుగా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు.' అని రామ్‌ గోపాల్‌ వర్మ తెలిపారు. 'మీరు ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్‌ రాసారు కాబట్టి కచ్చితంగా స్వర్గానికి వెళ్లుంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు నా హలో చెప్పండి. కానీ నేను ఎక్కవ పాపాలు చేసి నరకానికి వెళ్తాను. పొరపాటున స్వర్గానికి వస్తే మాత్రం మీరెలాగో నాతో వోడ్కా తాగరు. కాబట్టి అమృతం ఓ పెగ్గేద్దాం అని ఆడియో క్లిప్‌ ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ.

మరిన్ని వార్తలు