ఆర్జీవీ ఇంట విషాదం: కరోనాతో సోదరుడి మృతి

24 May, 2021 08:56 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్‌ కరోనాకు బలయ్యాడు. కొద్దిరోజులుగా కోవిడ్‌తో పోరాడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఆదివారం తుది శ్వాస విడిచాడు. కాగా సోమశేఖర్‌ రంగీలా, దౌడ్‌, సత్య, జంగల్‌, కంపెనీ వంటి పలు చిత్రాల నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాడు. అనురాగ్‌ కశ్యప్‌ రచయితగా పని చేసిన హిందీ సినిమా 'ముస్కురాకే దేఖ్‌ జర'కు దర్శకుడిగానూ పని చేశాడు. అతడి మరణంపై ఆర్జీవీ ఎమోషనల్‌ అయ్యాడు. "కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్‌ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్‌ అవుతున్నాను" అని పేర్కొన్నాడు.

'తల్లి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్న శేఖర్‌, కరోనా సోకిన తర్వాత కూడా ఆమె కోసం పరితపించాడు. ఈ క్రమంలో అతడూ కరోనా బారిన పడ్డాడు. అయినప్పటికీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకోగలిగాడు కానీ తను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు' అని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ విచారం వ్యక్తం చేశాడు.

సత్య చిత్రీకరణ సమయంలో వర్మ కంటే సోమశేఖర్‌కే ఎక్కువ భయపడేవాళ్లమన్న జేడీ చక్రవర్తి ఇద్దరి అభిరుచి ఒకటే కావడంతో చిన్న చిన్న తగాదాలు కూడా జరిగేవని తెలిపాడు. అయితే తొందరగానే అన్నింటినీ సర్దుకుపోయేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఈ మధ్య శేఖర్‌ ఒంటరివాడిగా మారిపోయాడని, కనీసం ఫోన్‌ కాల్స్‌ కూడా మాట్లాడకపోవడం ఆందోళనకు గురి చేసిందన్నాడు. ఇంతలోనే ఆయనను కరోనా కబళించడం విషాదకరమన్న జేడీ అతడు మన మధ్య లేనందుకు ఎక్కువగా బాధపడేది ఆర్జీవీనే అని తెలిపాడు.

చదవండి: నా చావుకు సుపారీ ఇచ్చాను, ఆ అవసరం రాదు: ఆర్జీవీ

మరిన్ని వార్తలు