అలా ఆమిర్‌ ఖాన్‌తో మనస్పర్థలు వచ్చాయి: ఆర్జీవీ

15 May, 2021 11:27 IST|Sakshi

రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈ పేరే ఒక సంచలనం. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వ్యంగ్యంగా స్పందిస్తూ జనాల్లో హాట్‌ టాపిక్‌ కావడం ఒక్క వర్మకే చెల్లుతుంది. ఎదుటి వాళ్లు ఎంతటివారైన సూటిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. అలా కొందరితో వివాదం పెట్టుకుంటే మరికొందరితో సన్నిహితం పెంచుకుంటాడు వర్మ. కాగా ఆయన తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా పలు సనిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన తీసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచాయి.

అందులో 1995లో వచ్చిన ‘రంగీలా’ మూవీ ఒక్కటి. జాకీ ష్రాఫ్‌, ఊర్మిళా మటోండ్కర్‌ కలిసి నటించిన ఈ మూవీలో ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని అనేక అవార్డులకు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమిర్‌ ఖాన్‌కు, ఆర్జీవీకి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూవీ సక్సెస్‌ తర్వాత ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో.. ఈ మూవీలో ఆమిర్‌ కంటే వెయిటర్‌ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడనే వ్యాఖ్యలు చేశాడని వార్తలు వెలువడ్డాయి. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అలా కొన్ని రోజుల పాటు తాము మాట్లాడుకోలేదని ఆర్జీవీ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఈ వ్యాఖ్యలు ఓ మీడియాలో వచ్చిన వెంటనే నేను, అమిర్‌ షాట్‌అవుట్‌ చేసుకునేందుకు అప్పట్లో ఫోన్లు లేవు. ఇప్పుడంటే మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. వెంటనే పరిష్కరించుకోవచ్చు. కానీ ఫోన్లు లేకపోవడం వల్ల మేమిద్దరం వెంటనే పరిష్కరించుకోలేకపోయాం. అప్పటికే ఆ వార్త విన్న ఆమిర్‌ నన్ను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టసాగాడు. ఆ తర్వాత ఒకరోజు ఇద్దరం కలుసుకుని అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకున్నాం’ అని చెప్పాడు.

ఈ సందర్భంగా ఆమిర్‌ మంచి నటుడని, అంకిత భావం ఎక్కువని, చాలా ఓపికగా ఉంటాడని, నటుడిగా ఆయనకు పతనం లేదంటూ ఆర్జీవీ కొనియాడాడు. ఇక అప్పుడు అసలు ఏం జరిగిందో చేబుతూ.. ‘నాకు ఆమిర్‌పై ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ మూవీలో ఓ కీలక సన్నివేశం దగ్గర టెక్నికల్‌ పాయింట్‌ ఇచ్చాను. ఆ సమయంలో కో-యాక్టర్‌ టైమింగ్‌ వల్ల ఆమీర్‌ డైలాగ్‌ డెలివరీ బాగా వచ్చిందని నేను భావించాను అని ఇంటర్వ్యూలో చెప్పాను. అది రాయకుండ ఆమిర్‌ కంటే వెయిటర్‌ ప్రదర్శన బెటర్‌ అనే శీర్షికతో ఆర్టికల్‌ వేశారు’ అంటూ అసలు విషయం వివరించాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు