Ram Gopal Varma: ఆ బుల్లెట్లకి ముందు.. తర్వాతి కథే ‘కొండా’ మూవీ : ఆర్జీవీ ఆసక్తికర వీడియో

25 Jan, 2022 13:52 IST|Sakshi

Konda Movie Secrets Revealed by Rgv: కాంట్రవర్సీకి కేరాఫ్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ(Ram Gopal Varma). ఆయన సినిమా కథలన్నీ వివాదాల చుట్టూ అల్లుకున్నవే. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యం బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. . ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు రామ్‌ గోపాల్‌ వర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా ‘కొండా’ సినిమా గురించి చెప్తూ ఓ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోని తన యూట్యూబ్‌ ఛానల్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ వీడియోలో ‘కొండా’మూవీ ఎలా ఉండబోతుందో చెప్పేశాడు ఆర్జీవీ.

‘కనీ వినీ యెరుగని  అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి.
కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం.

ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే  కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై, ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్.

ఆర్కే, భారతక్క విషయానికొస్తే..  తెలంగాణలో ఒక్క సామెత ఉంది. 'పొట్టోన్ని పొడుగోడు కొడ్తే, పొడుగోన్ని పోశమ్మ కొట్టిందంటరు' ప్రజలను కాలరాస్తు బలిసిపోయిన  నాయకులను, వాళ్ళకు అమ్ముడు పోయిన కొందరూ పోలీసులను, పోచమ్మలా నరికేదందుకు పుట్టినోళ్ళే ఆర్కే, భారతక్క. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు  గుండెల్లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి  ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే  ఉంటుంది.

పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కత్తులు  బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని  మించిన మైసమ్మ శాక్తులుగా నాకు అనిపించ బట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను.ఈ నిజాలన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయి . కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26న, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతుంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో  సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26న, రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి  కొండా మురళి పైన వంచనగిరిలో ఒక్క అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబంధించిన  కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్లకి ముందు కథ, వాటి తర్వాత కథే మా కొండా కథ’అని చెబుతూ.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు ఆర్జీవి.

మరిన్ని వార్తలు