ఎన్నిక‌ల ముందే ఈ సినిమా రిలీజ్ చేస్తా: ఆర్జీవీ

21 Nov, 2020 18:11 IST|Sakshi

సంచ‌ల‌నాల‌కు మారుపేరైన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు, ప‌వ‌ర్‌స్టార్, దిశ, నేక్‌డ్‌, క్లైమాక్స్‌, క‌రోనా వంటి వైవిధ్య‌మైన‌ సినిమాలను తెర‌కెక్కించిన ఆయ‌న ప‌నిలో ప‌నిగా త‌న‌ ఆత్మ‌క‌థ‌ను కూడా రాము పేరుతో మూడు భాగాలుగా తీసుకొస్తున్నారు. అయితే చేసిన సినిమాలు హిట్టు కొట్ట‌క‌పోయినా స‌రే పెద్ద‌గా లెక్క చేయ‌కుండా ఎప్పుడూ ఏదో ఒక బ‌యోపిక్‌తో సంద‌డి చేస్తూనే ఉంటారు. కానీ బ‌యోపిక్ చిత్రాల్లో డూపుల‌ను సెల‌క్ట్ చేసుకోవ‌డంలో మాత్రం వ‌ర్మ‌ను మించిన‌వారు లేరు. ఇప్పుడు వ‌ర్మ క‌న్ను త‌మిళ‌నాడు మీద ప‌డింది. అవినీతి కేసులో క‌ట‌క‌టాల వెన‌క్కు వెళ్లిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ బ‌యోపిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నిజానికి ఈ సినిమా చేస్తున్నాన‌ని వ‌ర్మ గ‌తేడాదిలోనే ప్ర‌క‌టించారు. 'ల‌వ్ ఈజ్ డేంజ‌ర‌స్‌లీ పొలిటిక‌ల్' అన్న క్యాప్ష‌న్‌తో పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. (చ‌ద‌వండి: శశికళ ఆశలు అడియాశలు..!)


ఏమైందో ఏమో కానీ త‌ర్వాత ఆ సినిమాను అట‌కెక్కించారు. తాజాగా శ‌నివారం నాడు మ‌రోసారి శ‌శిక‌ళ సినిమా గురించి ప్ర‌స్తావిస్తూ " J, S, E, P, S మ‌ధ్య ఉన్న బంధాన్ని, వారి రాజ‌కీయ తెరంగ్రేటాన్ని చూపించ‌బోతున్నాం. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల క‌న్నా ముందు, నాయ‌కురాలి(జ‌య ల‌లిత‌) బ‌యోపిక్ (త‌లైవి) రిలీజ్ అయ్యే రోజునే దీన్ని కూడా విడుద‌ల‌ చేస్తాం" అని చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు సినిమాకు సంబంధించిన‌ పోస్టర్ల‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితతో పాటు ఆమె ప్రాణ స్నేహితురాలు శ‌శిక‌ళ కూడా ఉన్నారు. 'తన సినిమాలో నిజాలు ఉంటాయని, ఫిబ్రవరిలో వాటిని తెర‌పై చూపిస్తా'నని వర్మ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. మ‌రి ఈ బ‌యోపిక్ మీద ఎన్ని వివాదాలు ముసురుకుంటాయో చూడాలి. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో న్యాయ‌స్థానం శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల జైలు శిక్ష‌, రూ.10 కోట్ల జ‌రిమానా విధించింది. దీంతో ఆమె 2017 ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. (చ‌ద‌వండి: ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు