అందుకే ‘డేంజరస్‌’ సినిమా తీశా: రామ్‌గోపాల్‌ వర్మ

7 Dec, 2022 00:20 IST|Sakshi
రామ్గోపాల్ వర్మ  

‘‘హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ నేపథ్యంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ, ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? అనే కొత్త ఆలోచనతో ‘డేంజరస్‌’ సినిమా తీశా. ఈ ప్రేమకథ సరికొత్తగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ రామ్గోపాల్ వర్మ వర్మ అన్నారు. నైనా గంగూలీ, అప్సరా రాణి లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డేంజరస్‌’. రామ్గోపాల్ వర్మ స్వీయ దర్వకత్వంలో నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 9న విడుదలకానుంది.

ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్‌ వంటి అంశాలతో ‘డేంజరస్‌’ తెరకెక్కింది. అబ్బాయిల వల్ల చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఇద్దరు అమ్మాయిలు, ఆ అమ్మాయిల మధ్య చిగురించే ప్రేమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మంచి హీరోయిన్‌ డేట్స్‌ దొరికి హీరో డేట్స్‌ కుదరకపోయినా ఇద్దరు హీరోయిన్లతో కూడా సినిమాలు చేయొచ్చనే ఆలోచనతో ఈ సినిమా తీశాను. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌గారితో, కన్నడలో ఉపేంద్రతో నా దర్శకత్వంలో చేయనున్న సినిమాలు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి .  

►ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయాలపై తొలి భాగం ‘వ్యూహం’, రెండవ భాగం ‘శపథం’ టైటిల్‌తో సినిమాలు చేయనున్నాను. సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు చనిపోయాక జరిగిన ఘటనలు, వ్యూహాల నేపథ్యంలో ‘వ్యూహం’ ఉంటుంది.. ఏపీ  రాజకీయాల్లో ఉన్న డ్రామా తెలంగాణలో లేదు. అందుకే ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు తీస్తున్నాను. పైగా వైసీపీ, టీడీపీ పార్టీల్లో నాకు ఫ్రెండ్స్‌ ఉండడం కూడా మరో కారణం. 

మరిన్ని వార్తలు