ఇది... జరిగిన 'మర్డర్'‌ కథే!

25 Dec, 2020 00:01 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘మర్డర్‌... కుటుంబకథా చిత్రమ్‌’
తారాగణం: శ్రీకాంత్‌ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ ఆవంచ, గిరిధర్‌;
సంగీతం: డి.ఎస్‌.ఆర్‌;
కెమెరా: జగదీశ్‌ చీకటి;
నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి;
దర్శకత్వం: ఆనంద్‌ చంద్ర;
రిలీజ్‌: డిసెంబర్‌ 24

వివాదాస్పద సంఘటనలను వెండితెర పైకి తెచ్చి, నిర్మాణం దశలోనే బోలెడంత ప్రచారం సంపాదించుకోవడం రామ్‌గోపాల్‌ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. మర్డర్‌... కుటుంబ కథా చిత్రం అందుకు మరో తాజా ఉదాహరణ. ఓ పరువు హత్య ఘటన ప్రేరణగా ఆయన తన బృందంతో చేయించిన సినిమా ఇది. కానీ, సినిమాలో ఉత్కంఠ రేపే రీరికార్డింగే కాక, కాస్తంతయినా విషయం కీలకమనేది మర్చిపోవడంతో కష్టం వచ్చిపడింది! 

కథేమిటంటే..: ‘పిల్లల్ని ముద్దు చేయాలి. కానీ అతి గారాబం చేస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. నాకు అది ఇప్పుడే తెలిసింది’ అంటూ తండ్రి పాత్ర వాయిస్‌ ఓవర్‌తో మొదలవుతుందీ సినిమా. చిన్నస్థాయి నుంచి కష్టపడి కోట్లకు పడగెత్తిన వ్యాపారి మాధవరావు (శ్రీకాంత్‌ అయ్యంగార్‌). మాధవరావు, వనజ (గాయత్రీ భార్గవి) దంపతుల ఏకైక కుమార్తె – నమ్రత (సాహితీ ఆవంచ). కాలేజీలో చదువుతూ, స్నేహితులు, లేట్‌ నైట్‌ పార్టీలతో గడుపుతున్నా తల్లితండ్రులు గారం చేసే ఆ అమ్మాయి, తన కాలేజ్‌ మేట్‌ ప్రవీణ్‌తో ప్రేమలో పడుతుంది. వేరే కులం వారైన ప్రవీణ్, అతని కుటుంబం – కేవలం ఆస్తి కోసమే ఈ ప్రేమ నాటకం ఆడుతున్నాడంటాడు తండ్రి. తల్లితండ్రులు కాదన్నా, ఎదిరించి ప్రవీణ్‌ను పెళ్ళాడి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూతురు. ముద్దుల కూతుర్ని ఎలాగైనా మళ్ళీ ఇంటికి రప్పించాలనే ఉద్దేశంతో మానవత్వం మరిచిన ఆ తండ్రి ఏం చేశాడు, చివరకు ఏం జరిగిందన్నది మిగతా కథ.

ఎలా చేశారంటే..: మూస ధోరణికి భిన్నంగా విచిత్రమైన కెమేరా యాంగిల్స్, కథలోనూ – సన్నివేశంలోనూ లేని ఉత్కంఠను కలిగించే నేపథ్య సంగీతంతో వచ్చిన రామ్‌గోపాల్‌ వర్మ మార్కు సినిమా – ‘మర్డర్‌’. తల్లితండ్రులు తమ పిల్లల్ని ప్రేమించడం తప్పా అని ప్రశ్నించే ఈ 113 నిమిషాల సినిమాలో తండ్రి పాత్ర కీలకం. కన్నకూతురును అతిగా ప్రేమించే ఆ తండ్రి పాత్రలో డాక్టర్‌ శ్రీకాంత్‌ అయ్యంగార్‌ క్లైమాక్స్‌ లాంటి కొన్నిచోట్ల జీవించారు. ఒకటీ అరా చోట్ల అతిగానూ అనిపించారు. తల్లి పాత్రలో యాంకర్‌ గాయత్రీ భార్గవికి చాలాకాలం తరువాత మంచి స్క్రీన్‌ స్పేస్‌ దక్కింది. కూతురిగా నటించిన సాహితీ ఆవంచకు ఇది తొలి చిత్రం. ఈ నూతన నటి బాగానే ఉన్నా, తనను అమితంగా ప్రేమించిన తల్లితండ్రులను ఆమె అంతగా ద్వేషించడానికి తగిన కారణాలను కథలో బలంగా చెప్పలేకపోయారు. ఫలితంగా కూతురి పాత్ర క్యారెక్టరైజేషన్‌ దెబ్బతింది. ఇక, సినిమాలోని మిగతా పాత్రలన్నీ కథానుసారం వచ్చి వెళుతుంటాయి. పెద్ద కథ లేదు... పేరున్న నటీనటులూ లేరు... లొకేషన్‌ ఛేంజ్‌లు లేవు... పాటలు లేవు... డ్యాన్సులు లేవు... కామెడీ లేదు... అయినా కదలకుండా కూర్చోబెట్టడానికి వర్మ బృందం శ్రమించింది. పూర్తిగా కాకపోయినా కొంతమేర సక్సెస్‌ అయింది. ఆ మేరకు ఇది రొటీన్‌ చిత్రాల వెల్లువలో ఓ విశేషమే.

ఎలా తీశారంటే..: సమాజంలో నలుగురి దృష్టినీ ఆకర్షించేలా ఏ చిన్న నేరసంఘటన జరిగినా, దాని మీద వెంటనే ఓ సినిమా తీయడంలో వర్మ సిద్ధహస్తుడు. ఈ సినిమా కూడా అచ్చంగా అంతే. రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో ఆయన శిష్యుడు ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో వచ్చిందీ చిత్రం. కానీ, వర్మ టేకింగ్‌ ఛాయలు తెర నిండా పుష్కలంగా కనిపిస్తాయి. తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన అమృత – ప్రణయ్‌ల ప్రేమకథ, పిల్ల తండ్రి మారుతీరావు చేయించారంటూ వార్తలొచ్చిన పరువుహత్య లాంటి వార్తలన్నీ అందరికీ తెలిసినవే. ఆ తెలిసిన, జరిగిన కథనే ఎమోషనల్‌ గా చెప్పడానికి వర్మ బందం ప్రయత్నించింది. చాలావరకు సక్సెస్‌ అయింది. కాకపోతే, న్యాయపరమైన ఇబ్బందుల రీత్యా ఈ సినిమాకూ, ఆ జరిగిన కథకూ సంబంధం లేదంటూ వాదించింది. నిజజీవితంలోని పేర్లను వాడకుండా, వాటికి దగ్గరగా ఉండే పేర్లతో సినిమా తీసింది. దీనికి, అనేక నిజజీవిత సంఘటనలు ఆధారమంటూ చెప్పుకొచ్చింది. కోర్టు వివాదాల మధ్య సెన్సార్‌ చిక్కుల్లో పడి, చివరకు తొమ్మిది మంది సభ్యుల రివైజింగ్‌ కమిటీ (ఆర్‌.సి) దగ్గర సెన్సార్‌ సంపాదించుకొందీ చిత్రం.

ఇద్దరు – ముగ్గురు పాత్రధారులు, ఒకే ఇంటిలో తిరిగే కెమేరాతో చాలా పరిమితమైన బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా మంచి బిజినెస్‌ వ్యూహమే. పైగా, ఆ పరిమితులేవీ తెలియనివ్వకుండా వీలైనంత జాగ్రత్తపడడానికి ప్రయత్నించడమూ ముచ్చటేస్తుంది. కానీ, ఒక దశలో కథ ముందుకు సాగక, అదే నాలుగు గోడల ఇంట్లో... అవే పాత్రలు, అదే రకమైన డైలాగులతో ప్రేక్షకులకు విసుగనిపిస్తుంది. అయితే, అంతటి ఆ విసుగులోనూ కూర్చొనేలా చేసే నేర్పు కూడా దర్శకుడి తీత చేసిన మాయాజాలం. అందుకు సహకరించిన కెమేరా, నేపథ్య సంగీత విభాగాలను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్న ప్రేమకథలన్నిటినీ  పిల్లల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తెరపై చూపడం రీతి, రివాజు. కానీ, ఈ ‘మర్డర్‌’ కథను మాత్రం అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచిన తండ్రి దృష్టి కోణం నుంచే పూర్తిగా చూపడం కొత్తగా అనిపిస్తుంది. అందుకే, సినిమా చూశాక, ప్రేమికుల మీద కన్నా పెంచిన తల్లితండ్రుల మీదే కొంత ఎక్కువ సానుభూతి కలిగితే తప్పు పట్టలేం. వెరసి సమాజంలో జరిగే ఇలాంటి మర్డర్‌ లను సమర్థించలేం. తెరపై చూపిన ఈ కథను బాగుందని అనలేం. పూర్తిగా బాగా లేదనీ చెప్పలేం. (చదవండి: డర్టీ హరి మూవీ రివ్యూ)

బలాలు: ∙నిజజీవిత ఘటనతో అల్లుకున్న కథ  
►విలక్షణమైన కెమేరా యాంగిల్స్‌
►ఉత్కంఠ రేపే నేపథ్య సంగీతం
బలహీనతలు: ప్రత్యేకంగా పెద్ద కథంటూ ఏమీ లేకపోవడం
►పాత్రలు, సంఘటనలన్నీ అక్కడక్కడే తిరగడం
►పాత్రధారులు బాగున్నా... కొన్నిచోట్ల అతిగా మారిన నటన

కొసమెరుపు: ఇదో అకల్పిత కథ. తల్లితండ్రుల కోణంలో మర్డర్‌ను సమర్థించే కథనం. 
– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు