క్రేజీ కాంబినేషన్‌: మరో తమిళ దర్శకుడితో మూవీ ప్లాన్‌ చేస్తున్న రామ్‌

17 Sep, 2022 19:25 IST|Sakshi

 టాలీవుడ్‌ యుంగ్‌ హీరో రామ్, దర్శకుడు గౌతమ్‌మీనన్‌ల క్రేజీ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కనుందని టాలీవుడ్‌లో టాక్‌. కోలీవుడ్‌లో స్టైలిష్‌ దర్శకుడుగా పేరు గాంచిన గౌతమ్‌మీనన్‌కు టాలీవుడ్‌లోనూ మంచిపేరు ఉంది. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయచేసావే చిత్రానికి దర్శకుడు ఈయనే అన్నది తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించి నాగచైతన్య, సమంతల కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది. కాగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి చాలామంది టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు ఆసక్తి చూపుతుంటారు.

తాజాగా నటుడు రామ్‌ ఈయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైపోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఒక భేటీలో స్వయంగా పేర్కొన్నారు. ఈయన తాజాగా శింబు కథానాయకుడిగా తెరకెక్కించిన వెందు తనిందదు కాడు చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై టాక్‌కు అతీతంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులోనే రూ.10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు పేరుతో స్రవంతి మూవీస్‌ రవికిషోర్‌ విడుదల చేశారు. కాగా నటుడు రామ్‌ హీరోగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించే చిత్రాన్ని ఈయనే నిర్మించనున్నట్లు సమాచారం.

నటుడు రామ్, నిర్మాత స్రవంతి రవికిషోర్‌లతో తనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నట్టు గౌతమ్‌మీనన్‌ పేర్కొన్నారు. తమ కాంబినేషన్లో రూపొందిన చిత్రం చాలా కొత్తగా ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇది కచ్చితంగా పాన్‌ ఇండియా చిత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. 
 

మరిన్ని వార్తలు