Ram Setu Review In Telugu: ‘రామ్‌ సేతు’ మూవీ రివ్యూ

25 Oct, 2022 17:49 IST|Sakshi
Rating:  

టైటిల్‌: రామ్‌ సేతు
నటీనటులు: అక్షయ్‌ కుమార్‌, నాజర్‌, సత్యదేవ్‌,  జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా తదితరులు
నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో
దర్శకత్వం : అభిషేక్‌ శర్మ
సంగీతం: డేనియల్ బి జార్జ్
సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా
ఎడిటర్: రామేశ్వర్ ఎస్ భగత్
విడుదల తేది: అక్టోబర్‌ 25, 2022

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్‌ సేతు’. రామ్‌ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్‌ అండ్‌ టాలెంట్‌ హీరో సత్యదేవ్‌ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా నేడు( అక్టోబర్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

Akshay Kumar Ram Setu Movie Review In Telugu

‘రామ్‌ సేతు’ కథేంటంటే..
ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు  రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం  భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్‌, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్‌ ఆర్యన్‌(అక్షయ్‌ కుమార్‌)తో ఓ రిపోర్ట్‌ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్‌కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్‌ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు.

అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్‌ హామీ ఇవ్వడంతో ఆర్యన్‌ వారి టీమ్‌లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్‌ టీమ్‌ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్‌ వేసిన ప్లాన్‌ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్‌ టీమ్‌కు ఏపీ(సత్యదేవ్‌)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్‌గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్‌ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌ ఏంటి? అనేదే మిగతా కథ.

Ram Setu Movie Cast And Rating

ఎలా ఉందంటే.. 
రామ్ సేతు ఒక అడ్వెంచర్‌ థ్రిల్లర్‌. రామసేతుని స్వయంగా శ్రీరాముడే నిర్మించాడని భారతీయులు విశ్వసిస్తారు. రామసేతు వేనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది అందరికి ఆసక్తికరమైన అంశమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ని తీసుకొని ‘రామ్‌ సేతు’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్‌ శర్మ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనాన్ని నడిపించడంలో విఫలమయ్యాడు. వాస్తవ గాధకు కల్పనను జోడించి కథనాన్ని నడిపించాడు. ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులను కట్టిపడేసేలా స్క్రీన్‌ప్లే ఉండాలి. ఈ చిత్రంలో అది మిస్‌ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్లస్‌ ఏంటంటే.. రామసేతు నిర్మాణానికి సంబంధించిన అనేక వాస్తవాలను ఈ చిత్రంలో చూపించారు. 

శ్రీలకంలో రావణాసురుడి ఆనవాళ్లు ఉన్నాయని, రామాయణం ప్రకారం రావణుడు ఉన్నాడంటే.. రాముడు కూడా ఉన్నట్లే కదా అని ఈ చిత్రం సారాంశం. శ్రీలంకలో ఉన్న త్రికూటరపర్వతం, అశోకవనం, స్వర్ణలంక ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించారు. అయితే హీరో టీమ్‌ చేసే పరిశోధన మాత్రం ఆసక్తికరంగా సాగదు. పేలవమైన స్క్రీన్‌ప్లే, పసలేని డైలాగ్స్‌, చప్పగా సాగే కీలక సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. నిర్మాణ విలువలు కూడా అంత ఉన్నతంగా ఉన్నట్లు కనిపించవు. 

Ram Setu Movie Stills

ఎవరెలా చేశారంటే.. 
ఆర్కియాలజిస్ట్‌ ఆర్యన్‌గా అక్షయ్‌ చక్కగా నటించాడు. తన పాత్రకు తగినట్టుగా ప్రొఫెషనల్‌గా తెరపై కనిపించాడు. గైడ్‌ ఏపీగా సత్యదేవ్‌ తనదైన నటనతో మెప్పించాడు. ఆయన ఎవరో అని రివీల్‌ చేసే సీన్‌ ఆకట్టుకుంటుంది. ఆర్యన్‌ టీమ్‌మెంబర్‌గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పాత్రకు న్యాయం చేసింది. నాజర్‌, నుస్రత్‌ బరూచాతో పాటు ఇతన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. డేనియల్ బి జార్జ్  సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు.  సినిమాటోగ్రఫర్‌  అసీమ్‌ మిశ్రా. ఎడిటర్‌ రామేశ్వర్‌ ఎస్‌ భగత్‌ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. 

- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.25/5)
మరిన్ని వార్తలు