శివయ్యా... కరుణించు

31 Aug, 2020 03:10 IST|Sakshi

‘‘హే శీశైలం మల్లయ్యా... ఈ భూగోళం మంచిగా లేదయ్యా...’’ అంటూ తనదైన శైలిలో స్పందించారు ప్రముఖ సినీ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన ‘మల్లయ్యా...’ అని లిరికల్‌ సాంగ్‌ను రాసి, తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘మూకుమ్మడి మరణాలు, శవాల దగ్గరికి మనుషులు రాకపోవటం ఇదంతా ఏంటి? అని నా మనసుకు అనిపించింది.

ప్రపంచం అంతా ఇదే ఆలోచనతో ఉండి ఉంటుంది. కానీ నేను దాన్ని కొంచెం పొడిగించి నాదైన ధోరణిలో ఆ శివయ్యను అడుగుదామనుకున్నాను. అందుకే ఈ పాట రాశాను. విన్నవాళ్లందరూ ‘మీ భావం చాలా చక్కగా ఉంది’ అన్నారు. ‘అయ్యా శివయ్యా, మూడోకన్ను తెరిచే సమయం ఆసన్నం కాలేదయ్యా, వద్దయ్యా వదిలిపెట్టయ్యా, మేము తప్పొప్పులు చేస్తే మమ్మల్ని నిండు మనసుతో క్షమించాల్సిన పెద్దరికం మీది. పిల్లలు తప్పు చేస్తే మందలించాలి కానీ, వీరభద్రుడివి అవుతావేంది.

మంచి చెప్పాలి కానీ, కోప్పడతావేంది.. ఏదో చెంపదెబ్బ కొట్టి సరిపెట్టుకోవాలి కానీ, అలా శివాలెత్తుతావేమయ్యా, శివయ్యా.. మనుషులన్నాక ఆ మాత్రం తప్పులు చేస్తాం. ఆ తప్పులను సరిచేసే భాద్యత నీదే. అంతేకానీ, ఇలా మూకుమ్మడిగా ప్రాణాలు తీస్తావా, మమ్మల్ని ఇబ్బంది పెడితే మా బాధ దేవుడెరుగు. మమ్మల్ని పుట్టించిన పార్వతీదేవికి కడుపుకోతను మిగులుస్తావా. కొంచెం శాంతించు, కరుణించు అనే ఉద్దేశంతో పాట ఉంటుంది’’ అన్నారు. ‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకు 1200 పాటలను రాశాను. ఈ ఏడాది అనేక పెద్ద సినిమాలకు రాస్తున్నాను’’ అని కూడా చెప్పారు రామజోగయ్య.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు