రిపీట్‌ చేయడం ఇష్టం ఉండదు

12 Jun, 2022 05:20 IST|Sakshi

– రానా

‘‘ఒక యాక్టర్‌గా అన్ని రకాల జానర్స్‌ చేయాలనుకుంటాను.. అయితే ఒకసారి చేసిన జానర్‌ను రిపీట్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓ మంచి కథను చెప్పాలంటే హీరోగానే చెప్పాల్సిన అవసరం లేదు.. బలమైన పాత్రలతో కూడా చెప్పొచ్చు’’ అని హీరో రానా అన్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా రానా పంచుకున్న విశేషాలు...  

సమయాన్ని రీ క్రియేట్‌ చేయడం ఒక్క సినిమాకే సాధ్యం. ‘విరాటపర్వం’ చిత్రం 1990 సమయంలో జరిగే కథ. ఈ చిత్రంలో రవన్న అనే ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. డాక్టర్‌ అయిన రవన్న అప్పటి సామాజిక పరిస్థితులు, అతని జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల కారణంగా ఉద్యమకారుడిగా మారతాడు. ఈ పాత్రకి ప్రత్యేకంగా ఎవర్నీ స్ఫూర్తిగా తీసుకోలేదు. కానీ, చెగువేరా వంటి నాయకుల ప్రభావం రవన్న పాత్రలో కనిపిస్తుంది.

రొటీన్‌ లవ్‌స్టోరీ కాదు
 ఒక లోతైన సముద్రంలోకి తోసేస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ‘విరాటపర్వం’ కథ విన్నప్పుడు నాకు అలాంటి అనుభూతి కలిగింది. మనసుకు అంత బరువుగా అనిపించింది. సీరియస్‌ టోన్‌తో చెప్పాల్సిన నిజాయితీ కథ ఇది. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేని రవన్న పాత్రలోకి వెన్నెల (సాయిపల్లవి పాత్ర పేరు) వస్తుంది. ఆ సమయంలో ఓ ఉద్యమకారుడిగా లక్ష్యం కోసం పనిచేయాలా? లేక ప్రేమికుడిగా గెలవాలా? అనే మోరల్‌ డైలమాలో పడతాడు రవన్న. రొటీన్‌ లవ్‌స్టోరీ చిత్రాలు నాకు ఇష్టం ఉండవు. ‘విరాటపర్వం’ చేశాక గొప్ప ప్రేమకథ చేశాననే ఫీలింగ్‌ కలిగింది. ఇందులోని లవ్‌స్టోరీని ఆడియన్స్‌ హాయిగా కాదు.. కాస్త భయాన్ని ఫీలవుతూ చూస్తారు.

మహిళలు కంటతడి పెట్టుకుంటారు
రవన్న, వెన్నెల పాత్రలే కాదు.. సినిమాలో ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళుతుంది. ప్రియమణి, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు, నందితా దాస్‌.. ఇలా ప్రతి పాత్ర బలంగానే ఉంటుంది. సినిమా చూశాక అబ్బాయిలు వావ్‌ అని ఆశ్చర్యపోతే.. మహిళలు మాత్రం కంటతడి పెట్టుకుంటారు. అందుకే ఇది మహిళల చిత్రం. రవన్న పాత్రలో ఎవరైనా నటించగలరేమో తెలియదు కానీ వెన్నెల పాత్రను మాత్రం సాయిపల్లవి తప్పితే మరొకరు చేయలేరు.. ఆమె అద్భుతంగా నటించారు.‘విరాటపర్వం’లాంటి సినిమాలను తెలుగులోనే చేయాలి.

ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. ఒక భాషకు చెందిన సాహిత్యం మరో భాషలో కుదరకపోవచ్చు. అందుకే ‘విరాటపర్వం’ సినిమాని పాన్‌ ఇండియాగా అనుకోలేదు. అయినా పాన్‌ ఇండియా అప్పీల్‌ కథలో ఉండాలి కానీ మనం పాన్‌ ఇండియా చేయాలని చేస్తే కుదరదేమో!. కథే నిర్ణయించాలి. అయితే ‘విరాటపర్వం’ సినిమాను మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో డబ్‌ చేస్తున్నాం. ఈ సినిమా కోసం నేను తొలిసారి ఓ పాట పాడాను. సురేశ్‌ బొబ్బిలి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా బాగుంది.

ఆ డైరెక్షన్‌లోకి వెళ్లలేదు
 సినిమాలు శాశ్వతం.. మనం తాత్కాలికం. అందుకే ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నేను కొత్తరకమైన సినిమాలు చేయాలనుకుంటాను. చిన్నాన్న(వెంకటేశ్‌)గారికి మంచి ఫ్యామిలీ ఇమేజ్‌ ఉంది.. అందుకే నేను ఆ డైరెక్షన్‌లోకి వెళ్లలేదు. చిన్నాన్నతో కలిసి నేను చేసిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌పై స్పష్టత రావాల్సి ఉంది. నేను చేయనున్న ‘హిరణ్య కశ్యప’ మార్చిలో స్టార్ట్‌ అవుతుంది. కొత్త చిత్రాలపై త్వరలో చెబుతా. 

మరిన్ని వార్తలు