హీరోగా వైష్ణవ్‌ తేజ్‌.. అదే నా బిగ్గెస్ట్‌ సక్సెస్‌: సాయిధరమ్‌ తేజ్‌

31 Aug, 2022 03:59 IST|Sakshi

‘‘రంగ రంగ వైభవంగా’ హిట్‌ అవుతుందా? బ్లాక్‌బస్టర్‌ అవుతుందా? అనేది నాకు తెలియదు. కానీ నా తమ్ముణ్ణి (వైష్ణవ్‌ తేజ్‌) మీరు(ప్రేక్షకులు)  హీరోగా యాక్సెప్ట్‌ చేశారు. అదే నా బిగ్గెస్ట్‌ సక్సెస్‌’’ అని హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. వైష్ణవ్‌ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్‌  కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘మళ్లీ ఇలా స్టేజ్‌పైకి వస్తానని ఊహించలేదు. నేను బైక్‌ ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్‌ ధరించడం వల్లే బతికాను. మీరు కూడా బైక్‌పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్‌ ధరించండి. వైష్ణవ్‌ తేజ్‌ తొలి చిత్రం ‘ఉప్పెన’ హిట్‌ అవడంతో ఆనందపడ్డాం. నా ‘రిపబ్లిక్‌’ సినిమా  రిలీజ్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో  సెప్టెంబరు 10న నాకు బైక్‌ ప్రమాదం జరిగింది. హాస్పిటల్‌లో పడుకుని ఉన్నప్పుడు నా తమ్ముడు వచ్చి ‘అన్నా..’ అని నన్ను పిలిస్తే పలకలేకపోయాను(భావోద్వేగంతో..). ఆ సమయంలో అమ్మ, నాన్న, నా తమ్ముడు నాతో ఉన్నారు. వైష్ణవ్‌ నా పక్కన ఉంటే నాకు ధైర్యం. వీడు నా బలం. సెప్టెంబరు 2న నా గురువుగారి (పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ..) బర్త్‌ డే. ఈ సినిమా చూసి గరువుగారి బర్త్‌ డే చేసుకోండి’’ అన్నారు. 

హీరో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ – ‘‘పెదనాన్న (చిరంజీవి), బాబాయ్‌(పవన్‌ కల్యాణ్‌) మాకు చెప్పింది ఒక్కటే.. ‘నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో అని’. మూడు సినిమాలు చేసినా వైష్ణవ్‌ తన కష్టాన్నే నమ్ముకున్నాడు’’ అన్నారు. ‘‘గిరిగారు కథ చెప్పినప్పుడు చాలా ఎగై్జట్‌ అయ్యాను’’ అన్నారు వైష్ణవ్‌తేజ్‌. ‘‘వైష్ణవ్‌గారు సెట్స్‌లో నాకు ఇచ్చిన రెస్పెక్ట్‌కి నా పదిహేనేళ్ల కష్టాన్ని మర్చిపోయాను’’ అన్నారు గిరీశాయ. ‘‘మెగా హీరోలతో నేను చేసిన సినిమాలన్నీ హిట్స్‌ సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. నటులు అలీ, నాగినీడు, కెమెరామేన్‌ శ్యామ్‌దత్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు