Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ

21 Mar, 2023 15:24 IST|Sakshi
Rating:  

టైటిల్‌: రంగమార్తాండ
నటీనటులు: ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు
నిర్మాత‌లు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం : కృష్ణవంశీ
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె.నల్లి
విడుదల తేది: మార్చి 22, 2023

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా  ‘నక్షత్రం’(2017)  బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న కృష్ణవంశీ..ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రిమియర్స్‌ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్‌ ఏర్పడింది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ‘రంగమార్తాండ’ కృష్ణవంశీకి కమ్‌బ్యాక్‌ చిత్రమైయిందా? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
రాఘవరావు(ప్రకాశ్‌ రాజ్‌) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదుని ప్రదానం చేస్తారు అభిమానులు. అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించి అందరికి షాకిస్తాడు. అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు. కొడుకు రంగారావు(ఆదర్శ్‌), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్‌)కి తాను ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేసుకున్న సొమ్ముని అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్‌ సిప్లిగంజ్‌)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు.

ఇలా బాధ్యతలన్ని తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది?  భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటిని నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రి(బ్రహ్మానందం)కు ఎలాంటి న్యాయం చేశాడు? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
మారాఠీ లో క్లాసిక్‌ అనిపించుకున్న ‘నటసామ్రాట్‌’కి తెలుగు రీమేకే రంగమార్తాండ. ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. నానా పటేకర్‌తో సహా ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్‌ బెస్ట్‌ యాక్టింగ్‌లు ఇచ్చేశారు. అలాంటి కథను రీమేక్‌ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించాడు. ‘నటసామ్రాట్‌’ సోల్‌ మిస్‌ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించాడు.

తెలుగు నాటకాలు..పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్‌ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్‌ చాలా ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్‌ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ముద్దగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి. ’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్‌ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. 

ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్‌ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం... ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్ని గుండెని బరువెక్కిస్తాయి. క్లైమాక్స్‌ సీన్‌ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. 

ఎవరెలా చేశారంటే..
ప్రకాశ్‌ రాజ్‌ నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల గొప్ప నటుడు ఆయన. రంగమార్తండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం ఒక సర్‌ప్రైజింగ్‌ ప్యాకెజ్‌. చక్రి పాత్రలో ఆయన తన కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్‌ ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం మారుతుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం నటన ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి సీన్‌లో  ప్రకాశ్‌రాజ్‌ని బ్రహ్మానందం పూర్తిగా డామినేట్‌ చేశాడు. తెరపై ఓ కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు.

ఇక రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతమని చెప్పాలి. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన బలం  ఇళయరాజా సంగీతం. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలకు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘రంగమార్తాండ’ కచ్చితంగా ఉంటుంది. ఈ కథ కొత్తదేం కాదు. అందరికి తెలిసిన కథే.. మనం నిత్యం చూస్తున్న అమ్మ నాన్నల జీవిత కథే. ఇంత గొప్పకథను అంతేగొప్పగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ తరం, రేపటి తరం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. 

-అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.5/5)
మరిన్ని వార్తలు