The Rapist: బూసన్‌ ఫీల్మ్‌ ఫెస్టివల్‌కి అపర్ణసేన్‌ ‘ది రేపిస్ట్‌’

7 Sep, 2021 12:31 IST|Sakshi

నటనతోపాటు దర్శకత్వంలో ప్రతిభతో జాతీయ అవార్డులు పొందిన బెంగాలి నటి అపర్ణ సేన్‌. నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ ఈస్ట్‌ అవార్డులు పొందింది. అంతేకాదు పలుమార్లు ఉత్తమ ఫిల్మ్‌ మేకర్‌గా నిలిచింది.  తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ది రేపిస్ట్‌'. ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌ బూసన్‌ ఇంటర్నేషనల్‌  ఫీల్మ్‌ ఫెస్టివల్‌ (బీఐఎఫ్‌ఎఫ్‌)లో ప్రదర్శితం కానుంది.

ఈ సందర్భంగా సినిమా దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ.. ‘మనుషులు రేపిస్టులుగా మారేందుకు దోహదపడే విషయాలను తెలుసుకోవడం, వారు మారేందుకు మార్గాలను అన్వేషిచడం నన్ను ఈ కథను ఎంచుకునేలా చేశాయి. అవే ఈ సినిమాలోని మూడు ముఖ్యపాత్రల్లో కనిపిస్తాయి’  అని తెలిపారు.  ‘మనకు రెండు రకాలు ఇండియాలు ఉన్నాయి.  పాత నమ్మకాలతో కూడిన మురికి వాడల్లో నివసించే ప్రజలతో ఒకటి, చదువుకుని ప్రగతిశీల విలువలతో ఉన్న ప్రజలతో మరొకటి నిండి ఉన్నాయి. రెండు రకాల భారతదేశాన్ని మా  సినిమాలో చూపించాం’అని చెప్పారు.

'ది రేపిస్ట్‌' నేపథ్యం ఇదే..
అర్జున్‌ రాంపాల్‌, కొంకణ్‌ సేన్‌ శర్మ నటించిన 'ది రేపిస్ట్‌' మూడు ముఖ్యపాత్రల ప్రయాణం. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఆ మూడు పాత్రల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. నేరాల వెనుక జరిగే పరిణామాలు నేరస్తులనే కాకుండా, నేరం నుంచి బయటపడిన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది.

ఈ చిత్రాని​ నిర్మించిన అప్లాజ్‌ ఎంటర్టైన్మెంట్‌ సీఈవో సమీర్‌ నాయర్‌ మాట్లాడుతూ.. మా మొదటి ఫీచర్‌ ఫిల్మ్‌కి అపర్ణ సేన్‌ లాంటి ప్రతిభవంతురాలితో కలిసి ఇలాంటి పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అది బీఐఎఫ్‌ఎఫ్‌ కోసం కిమ్ జిసెయోక్ అవార్డు నామినేట్‌ అవ్వడంతో ఆ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ప్రపంచ ప్రేక్షకుల మదిని దోచుకుంటుందని ఆశిస్తున్నామ"ని తెలిపాడు.

అపర్ణ సేన్‌ 1974 నుంచి 1983 వరకు ఉత్తమ నటిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు గెలుచుకోడంతో పాటు దర్శకత్వం, స్క్రీన్‌ రైటర్‌ వంటి వివిధ శాఖల్లో తన ప్రతిభను చాటుకుని జాతీయ అవార్డులను పొందింది. దీంతో చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1987లో పద్మశ్రీతో సత్కరించింది. కాగా ఆసియాలోనే అతి పెద్దదైన బీఐఎఫ్‌ఎఫ్‌ 26వ ఎడిషన్‌ అక్టోబర్‌ 6 నుంచి 15 వరకు జరగనుంది.

మరిన్ని వార్తలు