ఒకరికొకరం ప్రేమగా ఉందాం: ఇలియానా

1 Jan, 2021 04:13 IST|Sakshi

2020...ఉరుకుల పరుగుల ప్రపంచానికి బ్రేక్‌ వేసింది. ‘ఆగండి... ఆలోచించండి’ అని చెప్పింది. ‘మనీ’ మాత్రమే కాదు.. జీవితంలో ‘మెనీ థింగ్స్‌’ ఉంటాయని తెలియజేసింది. మంచి పాఠంలా ముగిసింది. కొత్త ఆలోచనలతో 2021ని స్వాగతించమంది. గడచిన విషయాల్లో చెడు ఉన్నా, అందులో మంచి కూడా ఉంటుంది. ఆ మంచిని తీసుకుని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. చాలామంది అంటున్న మాట ఇది. మరి... అందాల తారలు ఏమంటున్నారో చూద్దాం.

ప్లాన్స్‌ ఏమీ లేవు! 
– రష్మికా మందన్న
► న్యూ ఇయర్‌ కొత్త ప్లాన్స్‌ చేయలేదు. గోల్స్‌ కూడా పెట్టుకోలేదు.
► ప్రస్తుతం అయితే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి నా స్నేహితులతో గోవా వచ్చాను. ఇక్కడ స్నేహితులతో సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. 
► ఈ ఏడాదికి కొత్త రిజల్యూషన్స్‌ ఏమీ పెట్టుకోదలచుకోలేదు. ఎందుకంటే మనం చేసినట్లుగా 2020 సాగిందా? అందుకే ఈసారి నో ప్లాన్‌. 
► అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ ప్రపంచం మీది. మీరు అనుకున్నవి చేయండి. సాధించాలనుకున్న దానికోసం కష్టపడండి. ఎక్కువమంది స్నేహితులను చేసుకోండి. ప్రపంచాన్ని చూడండి. ఎక్కువ నవ్వండి. నచ్చింది తినండి. వర్కౌట్స్‌ చేయండి. అలానే కోవిడ్‌ వెళ్లిపోయిందనుకోవద్దు. కరోనా ఇంకా అలానే ఉంది. జాగ్రత్తగా ఉండండి. 

ఒకరికొకరం ప్రేమగా ఉందాం
– ఇలియానా
► చాలా మందికి ఈ ఏడాది చాలా కష్టంగా సాగిందని తెలుసు. అయితే 2020 నాకు కాస్త ఫన్నీగా గడిచింది అనిపించింది. కొన్నిసార్లు నాకూ కష్టకాలంగా అనిపించింది. నేను చాలా వాటికి రుణపడి ఉన్నాను. ముఖ్యంగా నా జీవితంలో ఉన్న కొద్దిమంది మనుషులకు కృతజ్ఞురాలిగా ఉండాలి. అంతమంచి మనుషులు నా చుట్టూ ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాతో నిలబడిన అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమను నేనెప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. మీరు పంచినదాని కంటే ఎక్కువ ప్రేమను మీకు తిరిగివ్వాలనుకుంటున్నా. 
► కొత్త సంవత్సరం సందర్భంగా నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే... మనందరం ఇతరులతో ఇంకాస్త ప్రేమతో, దయతో ఉందాం. ఇతరులను అర్థం చేసుకుందాం. అలాగే మనతో మనం ప్రేమగా ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. 

ఒక్క సెకను కేటాయించండి
– శ్రుతీహాసన్‌
► 2020కి బై చెప్పేశాం. నా గురించి నాకు ఎన్నో నేర్పించిన సంవత్సరం ఇది.
► నా కలలు, నా కళలు... వీటి పట్ల నా మీద నాకున్న నమ్మకాన్ని తెలియజేసింది.
► దారిలో ఎన్ని కష్టమైన మలుపులు వస్తే అన్ని పాఠాలు నేర్చుకున్నట్లు. కొత్త సంవత్సరంలో వచ్చే మలుపుల కోసం ఎదురు చూస్తున్నాను. అవి ఆశీర్వాదాలుగా భావిస్తాను.
► మనందరం ఒక్క సెకను కేటాయిద్దాం. మనపట్ల ప్రేమ, దయ కనబరిచనవాళ్లకు ధన్యవాదాలు చెప్పడం కోసమే ఆ సెకను. అలాగే అన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతున్నందుకు మనల్ని మనం అభినందించుకుందాం. 

మరిన్ని వార్తలు