చిటికేస్తే జరిగిపోవాలి!

23 Sep, 2020 04:00 IST|Sakshi

‘నన్ను ఏమైనా అడగండి. ఆసక్తిగా అనిపించిన ప్రశ్నలకు జవాబు చెబుతా’ అన్నారు రష్మికా మందన్నా. అంతే... ప్రశ్నల వర్షం కురిపించారు ఫ్యాన్స్‌. నచ్చిన టీవీ సిరీస్, తనలో తనకు నచ్చని అలవాటు, సూపర్‌ పవర్‌ ఉంటే ఏం చేస్తారు? స్ఫూర్తి మంత్రం? ఇలాంటివన్నీ చెప్పారు రష్మిక. ఆ విశేషాలు. 

మీకెలాంటి సూపర్‌ పవర్‌ కావాలని కోరుకుంటారు?
ఒక్క చిటికేస్తే ఎవరేం కోరుకున్నా అది జరిగేలాంటి పవర్‌ ఉండాలని కోరుకుంటాను.

హోటల్స్‌లో సరదాగా ? ఏదైనా దొంగతనం చేశారా?
షాపు బావుంటే దొంగలిస్తాను. అలాగే ఓసారి దిండు కవర్స్‌ బావున్నాయని దొంగలించాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా అపరాధ భావన కలుగుతోంది. 

నటిగా కెమెరా ముందుకు వెళ్లడం ఎలా అనిపిస్తుంది?
షూటింగ్‌కి వెళ్లడం అంటే ప్రతిరోజూ ఎగ్జామ్స్‌ రాయడానికి వెళ్లినట్టే. డైలాగ్స్‌ గుర్తుపెట్టుకోవాలి. సన్నివేశానికి తగ్గట్టు బాగా యాక్ట్‌ చేయాలి. అది చాలా ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. అలాగే చాలా థ్రిల్లింగ్‌గానూ ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌కి దూరమయ్యాను. మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. 

లాక్‌డౌన్‌ వల్ల వచ్చిన ఖాళీ సమయంలో మానసికంగా కుంగిపోకుండా ఎలా జాగ్రత్తపడుతున్నారు?
ప్రతీ ఒక్కరికీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ కరోనా అనేది ఎప్పటికీ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరోనా మొత్తం అంతం అయ్యాక లాక్‌ డౌన్‌ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేదే? అని మాత్రం బాధపడకూడదు. అందుకే ఎవరి వృత్తికి సంబంధించి వారు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే తర్వాత బాధపడే స్కోప్‌ ఉండదు. 

మీ స్ఫూర్తి మంత్రం ఏంటి?
కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎంతో ఎత్తుకి ఎదగాలని నా ఆశ. ఇది సాధిస్తే చాలు అనుకోను. అన్నీ సాధించాలనుకుంటాను. నాకు నేను హద్దులు పెట్టుకోను. బాలీవుడ్‌ సినిమాలు చేయాలి. హాలీవుడ్‌ సినిమాలు చేయాలి. ఆ కలలే నన్ను ఇంకా కష్టపడేలా చేస్తాయి. ప్రస్తుతం బుడిబుడి అడుగులే వేస్తున్నా. కానీ నా కలలను చేరుకుంటా. 

నెగటివిటీని ఎలా డీల్‌ చేస్తారు?
ఇంతకు ముందు నెగటివిటీని ఎలా హ్యాండిల్‌ చేయాలో అర్థం అయ్యేది కాదు. పట్టించుకోకుండా ఉండలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నెగటివిటీ నా దాకా రాలేదు... రానివ్వను. వచ్చినా పట్టించుకోను. నా మిత్రులు, నా కుటుంబం, నా టీమ్‌ అందరూ నెగటివిటీ నా దగ్గరకు రాకుండా సహాయపడుతుంటారు. 

మీలో మీకు చిరాకుగా అనిపించే లక్షణం?
చాలా ఉన్నాయి. ప్రతి దానికీ ఎక్కువ ఆలోచిస్తా. బాధపడతాను. ఇక ఎటువంటి సందర్భంలో అయినా నవ్వుతూనే ఉంటా. అది చాలా మందికి అయోమయంగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు బాగా ఒత్తిడిగా అనిపిస్తే హైపర్‌ అవుతాను. నా మెంటాల్టీ కొంచెం విచిత్రంగా ఉంది కదూ? నేను ఏలియన్‌ అనుకుంటా (నవ్వుతూ).

మీ స్ట్రెస్‌బస్టర్‌ ఏంటి? 
బాగా స్ట్రెస్‌ అనిపిస్తే వర్కౌట్స్‌ చేస్తా. అలాగే సంగీతం వింటాను. పిచ్చిపట్టినట్టు డ్యాన్స్‌ చేస్తాను. అంతే.. ఒత్తిడి మాయం అయిపోతుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా