నీ జీవితానికి నువ్వే యజమాని

20 Oct, 2021 00:23 IST|Sakshi

‘‘మనలోని ప్రతిభను మనం గుర్తించగలిగితే జీవితంలో మరింత ముందుకు వెళ్లవచ్చు’’ అంటున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. ఈ విషయం గురించి ఆమె సోషల్‌ మీడియా వేదికగా వరుస ట్వీట్స్‌ చేశారు. ‘‘ఒక మనిషిగా మనం లోపాలతో జన్మించి ఉండవచ్చు. అభద్రతాభావాల మధ్య జీవిస్తూ ఉండొచ్చు. కానీ ప్రపంచం నువ్వు ఏం చేయగలవని అనుకుంటుందో దానికన్నా ఎక్కువగానే నువ్వు సాధించగలవని తెలుసుకునే సమయం వస్తుంది.

నీలోని ఆ ప్రతిభను నువ్వు గుర్తించినప్పుడు నువ్వు బలమైన, తెలివైన వ్యక్తి అయిపోతావు. నిన్ను ఆపేవారు ఎవరూ ఉండరు. అయితే నీ జీవితంలో ఇతరుల ఆధిపత్యం ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీ శక్తి నీదే. కేవలం నీదే. ఫైనల్‌గా నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. మీ జీవితానికి, మనసుకు, భావోద్వేగాలకు మీరే యజమాని. మీ జీవితంలోని విలువైన వారి కోసమే వీటిని కేటాయించండి. అలాగే వారిని ఎంచుకోవడంలో తెలివిగా వ్యవహరించండి’’ అని పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఈ ట్వీట్స్‌ చదివిన నెటిజన్లు రష్మికా ఏదో విషయంలో గాయపడ్డారని, అందుకే ఇలా ట్వీట్స్‌ చేసి ఉంటారని అంటున్నారు. 

మరిన్ని వార్తలు