బంపర్‌ ఆఫర్‌? ధర్మ ప్రొడక్షన్స్‌లో రష్మికా సినిమా ఉంటుందా?

26 Jan, 2022 00:41 IST|Sakshi

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్న రష్మికా మందన్న బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘మిషన్‌ మజ్ను, గుడ్‌ బై’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈలోపు బాలీవుడ్‌ నుంచి మరిన్ని అవకాశాలు రష్మిక తలుపు తడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమాలో నటించే బంపర్‌ ఆఫర్‌ రష్మికని వరించిందని తాజా బాలీవుడ్‌ టాక్‌.

సోమవారం (జనవరి 24) ముంబయ్‌లోని కరణ్‌ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్‌ కార్యాలయానికి రష్మిక వెళ్లడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కరణ్‌ నిర్మించనున్న ఓ చిత్రంలో రష్మికను కథానాయికగా అనుకున్నారని, ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు సంస్థ కార్యాలయంలో జరిగాయని టాక్‌.

కాగా సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రాన్ని సోషల్‌ మీడియా ద్వారా కరణ్‌ అభినందించిన విషయం తెలిసిందే. బహుశా ‘పుష్ప’లో రష్మిక నటన నచ్చి, తన సినిమాకి తీసుకోవాలనుకున్నారేమో. అసలు ధర్మ ప్రొడక్షన్స్‌లో రష్మిక సినిమా ఉంటుందా? ఆ విషయం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు