Neha Shetty: హీరోయిన్‌తో డైరెక్టర్‌ గొడవ.. మూడు నెలలు మాట్లాడుకోలేదట!

22 Sep, 2023 09:48 IST|Sakshi

ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క చిత్రంతో వస్తుంది. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అదే జాబితాలోకి వస్తుంది నేహా శెట్టి. ఈ కన్నడ బ్యూటీ ముంగరు మేల్‌ 2 అనే కన్నడ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. కానీ ఈ మూవీ పేరు, అవకాశాలు తెచ్చిపెట్టలేదు. రెండేళ్ల తర్వాత 2018లో మెహబూబా సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. కానీ ఇక్కడా అదే పరిస్థితి! మళ్లీ మూడేళ్ల వరకు అవకాశాలే రాలేదు. అయితే డీజే టిల్లు సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. తను చేసిన రాధిక పాత్ర ఒక్కసారిగా స్టార్‌డమ్‌, అవకాశాలు తెచ్చిపెట్టింది. తర్వాత తను చేసిన 'బెదురులంక 2012' మూవీ కూడా హిట్‌.. ప్రస్తుతం ఈ రాధిక రూల్స్‌ రంజన్‌, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమాలు చేస్తోంది.

సమ్మోహనుడా సాంగ్‌ కోసం కష్టాలు..
ఇకపోతే కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్‌ రంజన్‌ అక్టోబర్‌ 6న విడుదల కానుంది. ఇందులోని సమ్మోహనుడా సాంగ్‌ ఇప్పటికే తెగ వైరలవుతోంది. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో హీరోయిన్‌తో గొడవైందంటున్నాడు దర్శకుడు రత్నం కృష్ణ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమ్మోహనుడా సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయిపోయింది. సమ్మోహనుడా పాటలో స్విమ్మింగ్‌ పూల్‌ షాట్‌ ఒక్కటే మిగిలి ఉంది. ఆ నీళ్లలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది. నేను షాట్‌కు అంతా సిద్ధం చేసుకున్నాను. ఆ నీళ్లలోకి వెళ్లి యాక్ట్‌ చేయమని చెప్తే.. నేహా రేపు పొద్దున నీవల్లే ఈ సమస్య వచ్చింది, నువ్వే చేయమన్నావ్‌ అంటుంది. అందుకని.. రివర్స్‌లో నువ్వు చేయొద్దులే అని చెప్పాను.

మోకాలికి గాయం.. అయినా వదిలేయని డైరెక్టర్‌
నిజానికి అంత చల్లని నీళ్లలోకి తనను పంపించి షూట్‌ చేయడం అసలు కరెక్ట్‌ కాదు. షాట్‌ క్యాన్సల్‌ చేస్తానన్నాను. లేదు, నేను ట్రై చేస్తానంటూ తను నీళ్లలోకి దిగింది. చాలాసేపు పూల్‌లో ఉండటంతో క్లోరిన్‌ వాటర్‌ వల్ల తన మోకాలికి కొద్దిగా గాయమైంది. అప్పటికే అరగంటపైనే అయింది. నాకింకా రెండు,మూడు షాట్స్‌ తీయాల్సి ఉంది. తను త్వరగా తీయ్‌, త్వరగా తీయ్‌ అని అంటుంటే ఇంకో 5-10 నిమిషాలు ఓర్చుకో అని చెప్పాను. తను నా మాట వినకుండా ఆ నీళ్లలో నుంచి బయటకు వచ్చేసింది.

మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు
ఇంకాసేపు ఉండుంటే ఆ రెండు షాట్స్‌ తీసేవాడిని కదా అని గొడవపడ్డాను. అలా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు. తర్వాత సినిమా ఎడిటింగ్‌ చేసేటప్పుడు వాటర్‌ సీన్‌ చూసి చాలా బాధపడ్డాను. అరె.. ఎవరూ ఇలాంటి షాట్‌ తీయలేరు, ఇలా చేయలేరు అనుకున్నాను. నేహాకు ఫోన్‌ చేసి మాట్లాడాను' అని చెప్పుకొచ్చాడు. నేహా సైతం ఈ షాట్‌ తర్వాత చాలా ఏడ్చాను అని తెలిపింది. ఓపక్క తను పడ్డ కష్టం, మరోపక్క షాట్‌ బాగా వచ్చిందన్న సంతోషంతో ఎమోషనలయ్యానంది.

చదవండి: గౌతమ్‌కు అన్యాయం? అప్పటిదాకా కన్నీళ్లు.. ఆ తర్వాత మాత్రం.. అబ్బో మహానటి!

మరిన్ని వార్తలు