ఈ పాట వింటే తప్పక సెల్యూట్‌ చేయాల్సిందే!

16 Jan, 2021 17:51 IST|Sakshi

నిజమైన హీరోలు అనగానే సైనికులే మనకు గుర్తుకువస్తారు. ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాస్తూ మనల్ని ఎల్లవేళలా కాపాడే యోధులు వారు. బాధ్యతలు నెరవేర్చే క్రమంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఎంతో ఇష్టంగా దేశ సేవ చేస్తారు. కర్తవ్య నిర్వహణలో తలమునకలై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ భరతమాతను కాపాడుతూ ఉంటారు. అయితే సాధారణ మనుషులకు ఉన్నట్లుగానే.. వాళ్లకు కూడా భావోద్వేగాలు ఉండటం సహజమే. కాస్త విరామం దొరికితే చాలు ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలు చూసుకుంటూ కాస్త సేద తీరుతారు. ఆప్తుల సమాచారం, ప్రియమైన వారి సందేశాలు చదువుకుంటూ తన్మయత్వంలో మునిగిపోతారు. తమ రాక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగా ఎదురుచూస్తున్నారోనన్న విషయాన్ని తలచుకుంటూ ఉద్వేగానికి లోనవుతారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన బార్డర్‌ సినిమాలోని ‘సందేశే ఆతే హై’ పాటలో ఇలాంటి భావోద్వేగాలను చక్కగా చూపించారు. (చదవండి: సరిలేరు మీకెవ్వరు.. జవాన్లపై ప్రశంసలు)

ఇక శుక్రవారం ఆర్మీ డే సందర్భంగా.. ఓ యువకుడు దేశ సరిహద్దుల్లో గిటార్‌ వాయిస్తూ ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. ఓ యువతి కూడా అతడితో గొంతు కలిపి పాటను మరింత మధురంగా మార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ సైతం దీనిని రీట్వీట్‌ చేయడం విశేషం. ఇక.. ‘‘ఇలాంటి సందేశాలు వస్తాయి.. ఇంటికి ఎప్పుడు వస్తారు అంటూ వాళ్లు మనల్ని అడుగుతూ ఉంటారు’’ వంటి పంక్తులతో సాగే ఆ పాట చాలా మంది ప్లేలిస్టులో  ఆల్‌టైం ఫేవరెట్‌గా ఉం‍టుందనడంలో అతిశయోక్తి లేదు.

మరిన్ని వార్తలు