‘కృష్ణంరాజు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తుంటే వింతగా చూసేవారు!’

12 Sep, 2022 18:02 IST|Sakshi
కృష్ణంరాజు చదివిన పెద్దాపురప్పాడు హైస్కూల్‌ ఇదే..  

కరప(కాకినాడ జిల్లా): యండమూరులోని చిన్నమ్మ, చిన్నాన్నల ఇంటి వద్ద ఉండి సినీనటుడు కృష్ణంరాజు పాఠశాల విద్యనభ్యసించారు. 9, 10వ తరగతి వరకూ పెద్దాపురప్పాడు హైస్కూల్‌లో చదువుకున్నట్టు ప్రజలు చెబుతున్నారు. కృష్ణంరాజు మరణవార్త వినగానే యండమూరులో విషాదచాయలు అలముకొన్నాయి. కృష్ణంరాజుతో కొద్దిగా పరిచయమున్న, పెద్దలు అంబడి వీర్రాజు, షేక్‌ మౌలానా, వాసంశెట్టి అప్పారావు, మీసాల చక్రం, షేక్‌ దరియా తెలిపిన వివరాల ప్రకారం..
చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి

కృష్ణంరాజు మొగల్తూరులో చదువుకునేటప్పుడు అల్లరిగా తిరుగుతున్నాడని తల్లిదండ్రులు యండమూరులో ఉంటున్న చిన్నాన్న, చిన్నమ్మలైన శ్రీకాకర్లపూడి వెంకటేశ్వరరాజు, సుభద్రాదేవి(అమ్మాజీ)ల ఇంటికి పంపించారు. యండమూరులో హైస్కూల్‌ లేకపోవడంతో పెద్దాపురప్పాడు హైస్కూలో చేర్పించారు. 10వ తరగతిలో ఉండగా సైకిల్‌పై వెళ్లేవారని, అప్పట్లో ఎవరూ సైకిల్‌పై వెళ్లక కృష్ణంరాజు తొక్కుకుంటూ వెళుతుంటే వింతగా చూసేవారని కొందరు తెలిపారు.

ఒకసారి కబడ్డీ ఆడుతుండగా భాషా అనే కుర్రాడు కృష్ణంరాజును వీపుపై కొడితే గాయమైందని, చిన్నాన్న వెంకటేశ్వరరాజు కోప్పడడంతో అప్పటి నుంచి ఆటలాడటం మానేసినట్టు వాసంశెట్టి అప్పారావు తెలిపారు. కాకినాడ పార్లమెంట్‌ సభ్యుడిగా గెలుపొందిన తర్వాత గ్రామానికి తీసుకొచ్చి, సత్కరించినట్టు యండమూరు వాసులు తెలిపారు. తర్వాత యండమూరులోని చిన్నాన్న, చిన్నమ్మల ఇల్లు విక్రయించగా, కృష్ణంరాజు వారి కుటుంబానికి సహాయం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు