Recap 2022: స్టార్స్‌కు మాట.. పాట సాయం చేసిన మరో స్టార్‌ హీరోలు

20 Dec, 2022 09:36 IST|Sakshi

ఒక స్టార్‌ హీరో సినిమాకి మరో స్టార్‌ మాట సాయం చేస్తే.. పాట సాయం కూడా చేస్తే.. ఆ ఇద్దరు స్టార్ల అభిమానులకు పండగే పండగ. 2022 అలాంటి కొన్ని పండగలను ఇచ్చింది. అడగ్గానే కాదనకుండా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి, మాట... పాట పాడిన కొందరు స్టార్స్‌ గురించి తెలుసుకుందాం. 

దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు చిరంజీవి. అది కూడా నాలుగు చిత్రాలకు. 2017లో వచ్చిన రానా ‘ఘాజీ’, మంచు మనోజ్‌ ‘గుంటూరోడు’ చిత్రాల తర్వాత ఈ ఏడాది లీజైన  మోహన్‌బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’, బాలీవుడ్‌ చిత్రం రణ్‌బీర్‌ కపూర్‌ ‘బ్రహాస్త్రం’కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఫిబ్రవరి 18న విడుదలైంది. రణ్‌బీర్, ఆలియా  జంటగా, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మాస్త్రం’ ట్రయాలజీలోని ‘బ్రహ్మాస్త్రం: పార్ట్‌ 1 శివ’ సెప్టెంబరు 9న రిలీజైంది.

(చదవండి: ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్‌)

అదే నెల 30న విడుదలైన మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పార్ట్‌ 1 చిత్రానికీ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగ మార్తాండ’లోని షాయరీ చిరంజీవి వాయిస్‌తో ఆడియన్స్‌కు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ టైటిల్‌ రోల్‌ చేయగా, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలను చిరంజీవితో షాయరీగా చెప్పించారు కృష్ణవంశీ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరోవైపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు మహేశ్‌బాబు. పవన్‌ కల్యాణ్‌ ‘జల్సా’ (2008), ఎన్టీఆర్‌ ‘బాద్‌షా ’(2013), దివంగత నటుడు కృష్ణ టైటిల్‌ రోల్‌ చేసిన ‘శ్రీశ్రీ’ (2016), సందీప్‌ కిషన్‌ హీరోగా చేసిన ‘మనసుకు నచ్చింది’ (2018) చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన మహేశ్‌ ఈ ఏడాది ‘ఆచార్య’కు ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 29న రిలీజైన సంగతి తెలిసిందే.

(చదవండి: ఉదయనిధి స్టాలిన్‌ మంత్రి కావడంపై విశాల్‌ కీలక వ్యాఖ్యలు)

మరోవైపు యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి తనకు ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’లాంటి హిట్‌ అందించిన ఆర్‌ఎస్‌జే స్వరూప్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’కి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న రిలీజైంది.

ఇంకోవైపు ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్‌’ సినిమా తెలుగు వెర్షన్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. మార్చి 11న ఈ చిత్రం విడుదలైంది. ఇక వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై  ఇప్పటికే ‘అ!’, ‘హిట్‌’, ‘హిట్‌ 2’ సినిమాలను నిర్మించిన నాని ఈ ఏడాది వెబ్‌ ఆంథాలజీ ‘మీట్‌ క్యూట్‌’ నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలు. ఈ సినిమా ట్రైలర్‌కు నాని వాయిస్‌ ఓవర్‌ అందించారు. సోనీ లివ్‌లో నవంబరు 25 నుంచి ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్‌ అవుతోంది. గతంలో తాను నిర్మించిన ‘అ!’కు నాని వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.   

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ గ్లింప్స్‌కు హీరో ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ సినిమాలో మరోచోట కూడా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న రానుంది.   

పాటల సందడి.. 
ఇప్పటికే ఎన్నో పాటలకు గాత్రం అందించిన శింబు ఈ ఏడాది బాగా సౌండ్‌ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్‌’లోని ‘బుల్లెట్‌ సాంగ్‌’ పాడారు. తమిళంలోనూ ఈ పాటను పాడారు శింబు.  రామ్, కృతీ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. అలాగే ఈ ఏడాది శ్రోతలను మెప్పించిన మరో పాట ‘టైమ్‌ ఇవ్వు పిల్ల..’ కూడా శింబు పాడిందే. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన ‘18 పేజెస్‌’ చిత్రంలోని పాట ఇది. వీటితో పాటు నిర్మాతగా హీరో రవితేజ తెలుగులో సమర్పించిన తమిళ చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’ థీమ్‌ సాంగ్‌ కూడా శింబు గొంతు  నుంచి వినిపించిందే. ఫిబ్రవరి 11న ఈ చిత్రం రిలీజైంది.

అలాగే తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు) సినిమా కోసం కూడా శింబు పాట పాడారు. ఈ చిత్రం జనవరిలో రిలీజ్‌ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ తనయ ఆదితి పాడిన తొలి పాట ‘రోమియోకి జూలియట్‌లా’. వరుణ్‌ తేజ్, సయీ మంజ్రేకర్‌ జంటగా నటించిన ‘గని’లోని పాట ఇది. ఈ సినిమా ఏప్రిల్‌ 8న రిలీజైంది. ఇలా మాట.. పాట సాయం చేసిన స్టార్స్‌ మరికొందరు ఉన్నారు.

మరిన్ని వార్తలు