నిరాశపరిచే రీమేకు ఇది!

16 Jan, 2021 05:36 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘రెడ్‌’; తారాగణం: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌; సంగీతం: మణిశర్మ; కెమేరా: సమీర్‌ రెడ్డి; ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌; ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖ్‌; నిర్మాత: స్రవంతి రవికిశోర్‌; దర్శకత్వం: కిశోర్‌ తిరుమల; రిలీజ్‌: జనవరి 14.

ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషకు తెస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యథాతథంగా మాతృకనే అనుసరించవచ్చా? అలా అనుసరిస్తే ఈజీనా, ఇబ్బందా? ఇది నిజంగా చర్చించాల్సిన విషయమే. మరీ ముఖ్యంగా రామ్‌ హీరోగా సంక్రాంతికి రిలీజైన ‘రెడ్‌’ చూసినప్పుడు ఈ ప్రశ్నలన్నీ మదిలో మెదులుతాయి. పక్క భాషలో ఎంత హిట్టయిన కథనైనా, మన దగ్గరకు తెచ్చుకున్నప్పుడు లోకల్‌ సెన్సిటివిటీస్‌కు తగ్గట్టు మార్చుకోవడం ఎంత అవసరమో, హిట్‌కు కారణమైన అంశాల్ని కదిలించకపోవడమూ అంతే కీలకం. తమిళ హిట్‌ ‘తడమ్‌’ ఆధారంగా వచ్చిన ‘రెడ్‌’ ఆ సంగతి మరోసారి ప్రూవ్‌ చేసింది.

కథేమిటంటే..: సిద్ధార్థ (రామ్‌) భవన నిర్మాణ రంగంలో పైకి వస్తున్న సివిల్‌ ఇంజనీర్‌. మహిమ (మాళవికా శర్మ)ను ప్రేమిస్తాడు. మరోపక్క ఆదిత్య (రామ్‌ ద్విపాత్రాభినయం), అతని స్నేహితుడు వేమా (సత్య) ఆవారాగా తిరుగుతుంటారు. వాళ్ళు డబ్బు కోసం ఇబ్బందిపడుతున్న టైమ్‌లో ఆదిత్యకు, గాయత్రి (అమృతా అయ్యర్‌) ఎదురవుతుంది. ఈ ఇద్దరి కథలూ ఇలా సాగుతుండగా బీచ్‌ రోడ్డులో ఓ హత్య జరుగుతుంది. ఆ హంతకుడు సిద్ధార్థ, రామ్‌లలో ఎవరు అనేది చిక్కుముడి. ఆ హత్య ఎవరు, ఎందుకు చేశారు? సిద్ధార్థ – ఆదిత్యల మధ్య సంబంధం ఏమిటి లాంటివన్నీ మిగతా కథ.

ఎలా చేశారంటే..: తెర మీద లైవ్‌ వైర్‌ లాంటి ఎనర్జీ ఉన్న కొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకరు రామ్‌. గత చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో అదేమిటో చూపిన హీరో రామ్‌ ఈసారి ‘రెడ్‌’లో ద్విపాత్రాభినయం చేశారు. సినిమాను తన రెండు పాత్రల భుజాల మీద మోశారు. కానీ, ఈ తమిళ రీమేక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను కొన్నిచోట్ల అనవసరంగా మార్చారు. కొన్నిచోట్ల అవసరం ఉన్నా మార్చలేదు అనిపిస్తుంది. దాంతో, తంటా వచ్చిపడింది. పోలీసు అధికారిగా నివేదా పేతురాజ్‌ ఉన్నంతలో తన పాత్ర బాగానే చేశారు. కానీ, ఆ పాత్రకున్న పరిధే తక్కువ. మాళవికా శర్మ చూడడానికి బాగున్నారు. సినిమాలో తక్కువ నిడివే ఉన్నా, బలంగా హత్తుకొనే గాయత్రి పాత్రలో అమృతా అయ్యర్‌ సరిగ్గా సరిపోయారు. కమెడియన్‌ సత్య కామిక్‌ రిలీఫ్‌ ఇస్తారు. అయితే, ఏ పాత్రా మనసుకు హత్తుకోకపోవడమే పెద్ద ఇబ్బంది.

ఎలా తీశారంటే..: ఇప్పటికే ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ లాంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు తీసిన దర్శక, రచయిత కిశోర్‌ తిరుమల ప్రయత్నించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఆయన తనకు అలవాటైన క్యూట్‌ లవ్‌ స్టోరీ ట్రాక్‌తోనే సినిమా మొదలెట్టారు. అక్కడక్కడ తనదైన మార్కు ఆకట్టుకొనే డైలాగులతో ఆకట్టుకున్నారు. అయితే, అసలు థ్రిల్లింగ్‌ కథ దగ్గరకు వచ్చేసరికి తన మార్కు చూపించలేకపోయారు. రెండు పాత్రల మధ్య వేరియేషన్‌ చూపడానికి ప్రయత్నించినా, ఒక దశలో కొంత కన్‌ ఫ్యూజింగ్‌గానూ అనిపిస్తుంది. సినిమాలోని పాత్రల పాత కథల మీద ఉన్న శ్రద్ధ, వర్తమానంలో వాటి మధ్య ఉన్న సంఘర్షణను తెరపై చూపడం మీద పెట్టలేకపోయారు. అలాగే, సినిమాలోని డ్యుయల్‌ రోల్‌లో ఎవరు ఏ రామ్‌ అన్నది కన్‌ఫ్యూజన్‌ లేకుండా చూపడంలోనూ యూనిట్‌ ఫెయిలైంది. అయితే, ఇటలీలో తీసిన పాటలలాంటివి కలర్‌ఫుల్‌ గా ఉన్నాయి. హెబ్బా పటేల్‌తో తీసిన ఐటమ్‌ సాంగ్‌ ‘ఢించక్‌ ఢించక్‌...’ మాస్‌ను ఆకట్టుకుంటుంది. పీటర్‌ హెయిన్‌ తీసిన పోలీస్‌ స్టేషన్‌ ఫైట్‌ లాంటివి, హీరో డ్యుయల్‌ రోల్‌ సీన్లను సహజంగా అనిపించేలా తీసిన కెమేరా వర్క్‌నూ అభినందించాల్సిందే. మణిశర్మ నేపథ్య సంగీతం అమృతా అయ్యర్‌ ఎపిసోడ్, మదర్‌ సెంటిమెంట్‌ లాంటి ఘట్టాల్లో ప్రత్యేకించి బాగుంది. రెండు పాత్రల రామ్‌... తనది డ్యుయల్‌ ర్యామ్‌ అనిపించుకున్నారు. కానీ కథ, కథన లోపాలు – మదర్‌ సెంటిమెంట్‌ కూడా యాంటీ సెంటిమెంట్‌గా అనిపించడం – మన నేటివిటీకి నప్పని స్త్రీ పాత్రల స్వభావాలు – ఇవన్నీ అసంతృప్తికి గురిచేస్తాయి. రెడ్‌ అనే టైటిల్‌కు జస్టిఫికేషనూ వెతుక్కుంటాం. వెరసి, ఈ థ్రిల్లర్‌ సినిమాలో థ్రిలింగ్‌ తక్కువ. వినోదమూ తక్కువే.

కొసమెరుపు: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రామ్‌ జోరుకు ఇది ఓ రెడ్‌ సిగ్నల్‌!

బలాలు: ∙రెండు పాత్రల్లో రామ్‌ ఎనర్జిటిక్‌ నటన
∙మణిశర్మ నేపథ్యసంగీతం, నిర్మాణ విలువలు
∙అక్కడక్కడ మెరిసే డైలాగులు

బలహీనతలు: ∙తెలుగు నేటివిటీకి పొసగని కొన్ని స్త్రీ పాత్రల ప్రవర్తన ∙నిదానంగా సా...గే కథనం ∙కన్విన్సింగ్‌ గా లేని కీలకమైన సెకండాఫ్‌ ∙పండని మదర్‌ సెంటిమెంట్‌ ∙పస తగ్గిన థ్రిల్లింగ్‌ అంశాలు

-రివ్యూ: రెంటాల జయదేవ 

మరిన్ని వార్తలు