వర్మ మన ఖర్మ పుస్తకం ఆవిష్కరణ

9 Nov, 2020 20:32 IST|Sakshi
పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా వర్మతో రేఖ

సాక్షి, హైదరాబాద్‌ : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఉన్న ఫాలోయింగ్‌ అంతాఇంత కాదు. వర్మను విమర్శించే వాళ్లు ఎంతమంది ఉంటారో.. అంతకు మించి ఆరాధించే వారు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంచలన దర్శకుడిని ఇష్టపడే యువ రచయిత రేఖ పర్వతాల అతనిపై ఓ పుస్తకాన్ని సైతం లిఖించి.. తన అభిమానాన్ని చాటుకున్నారు. రచయిత్రి రేఖ పర్వతాల రచించిన ‘వర్మ మన ఖర్మ’ పుస్తకాన్ని సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు.

సీనియర్‌ పాత్రికేయిరాలు స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ .. చిన్న వయస్సులోనే రేఖ పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. తన గూర్చి ఏం రాశావు అని ఎప్పుడూ అడగలేదని, ఆమె ఫ్యాషన్‌ ఆమెను పూర్తిచేసుకోమ్మన్నానని తెలిపారు. తాను రచయిత్రి స్థానంలో ఉంటే అంకితం నాకు ఆయనకు అని పెట్టకుండా నాకు వాడికి అని పెట్టేవాడినన్నారు. తాను ఎప్పుడూ ఒకే ఫిలాసఫీ ఫాలో అవ్వనని, నా కన్వినెంట్‌ ప్రకారం అవి మారుస్తుంటానన్నారు. ప్రతీ మనిషిలో ఒక మృగం, రాక్షసుడు దాగి ఉంటారని దాన్ని బయటకు తీయడం తప్పు అని అందరూ అంటారని, కాని మృగాన్ని బయటకు తీసి మనం చేయాలనుకున్నది చేయాలని తాను చెపుతానన్నారు. సమస్యలగూర్చి ఎప్పుడూ పట్టించుకోనని, ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, కాని భాధపడితే లాభం ఉండదన్నారు. బర్నింగ్‌ టాపిక్స్‌పై తాను సినిమాలు తీయనని, మంటలు ఆరాక సినిమాలు తీస్తానన్నారు. తాను ఇప్పటివరకు మాస్క్‌ ధరించలేదని, సానిటైజర్‌ వాడలేదని, భౌతికదూరం పాటించలేదని కరోనా కోసం తన లైఫ్‌స్టైల్‌ను మార్చుకోనని, తాను తనలాగే బతుకుతానని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు.

రచయిత్రి రేఖ పర్వతాల మాట్లాడుతూ .. ఆర్‌జీవీ అంటే తానకు చాలా ఇష్టమని, ఆయన నాకు గురువు లాంటివారన్నారు. నాకు కూడా ఆర్‌జీవీలా స్వతంత్రంగా బతకడం ఇష్టమన్నారు. కార్యక్రమంలో వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ, రచయిత్రి తల్లి సుమతి, తండ్రి రత్నయ్య, సైకాలజిస్ట్‌ విషేశ్‌ పలువురు సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు