ఆ హీరో తల్లి నన్ను చెప్పుతో కొట్టడానికి ‍ప్రయత్నించింది: రేఖ

8 Sep, 2021 21:10 IST|Sakshi

సినీ పరిశ్రమలో ప్రేమించడం, విడిపోవడం సర్వసాధారణం అన్నట్లు కనిపిస్తాయి. ఇక ఎవరైనా హీరో-హీరోయిన్‌ కాస్త సన్నిహితంగా ఉంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ధోరణే ఎప్పటి నుంచో ఉంది. 1970 దశకంలో ఇలాంటి లవ్‌ట్రాక్‌ వార్తలు ఎక్కువగా అప్పటి హీరోయిన్‌ రేఖ గురించి వచ్చేవి. అందం, అభినయంతో ఉత్తమ నటిగా ఎందరో అభిమానాన్ని, ఎన్నో అవార్డులను దక్కించుకున్న రేఖ గురించి.. మీడియాలో మాత్రం ఎక్కువగా వచ్చే వార్తలు ఆమె లవ్‌ ట్రాక్‌కు సంబంధించినవే. 

రేఖ-వినోద్‌ మెహ్రాల లవ్‌ ట్రాక్‌ కూడా ఇలానే వార్తల్లో నిలిచింది. వినోద్‌ మెహ్రా, రేఖతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం రేఖను అంగీకరించలేదు. ముఖ్యంగా వినోద్‌ మెహ్రా తల్లి వీరిద్దరి బంధాన్ని గట్టిగా వ్యతిరేకంచేవారు. రేఖ పట్ల ఆమె వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండేదో తెలిపే సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి అప్పట్లో మీడియాలో వచ్చింది. ఆ క్లిప్పింగ్‌లోని వివరాలు.. (చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్‌)

పీకల్లోతు ప్రేమలో మునగిపోయిన రేఖ-వినోద్‌మెహ్రాలు ఎవరికి చెప్పకుండా రహస్యంగా కోల్‌కతాలో వివాహం చేసుకున్నారు. అనంతరం వినోద్‌ మెహ్రా.. రేఖను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. తల్లికి తాను పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. ఈ వార్త విని వినోద్‌ తల్లి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రేఖ మీదకు ఆమెకు ఎంత కోపం వచ్చిందంటే.. తన చెప్పు తీసుకుని రేఖను కొట్టడానికి వెళ్లారు. తల్లిని శాంతిపజేసేందుకు వినోద్‌ మెహ్రా ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె ఆగ్రహం చల్లారలేదు. రేఖను తీవ్రంగా అవమానించారు. వీటిని తట్టుకోలేకపోయిన రేఖ కన్నీరుపెట్టుకుంటూ వినోద్‌ ఇంటి నుంచి వెళ్లిపోయారు. (చదవండి: వైరల్‌: పాక్‌ పీఎం, బాలీవుడ్‌ హీరోయిన్‌ లవ్‌ స్టోరి)

ఇంతటి అవమానం జరిగిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు రేఖ-వినోద్‌ మ్రెహా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. అనంతరం 1988లో వినోద్‌ మెహ్రా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీని గురించి 1973లో రేఖ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘వినోద్‌ మెహ్రా తల్లి దృష్టిలో నేను కేవలం ఓ నటిని మాత్రమే కాదు.. ఎన్నో అపవాదులు ముటగట్టుకున్న ఓ మహిళను. గతంలో ఎన్నో చేదు అనుభవాలు కలిగిన మహిళను వినోద్‌ తల్లి తన కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు’’ అని చెప్పుకొచ్చారు రేఖ.

ఆ తర్వాత రేఖ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన ఏడు నెలలకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా అందరూ రేఖనే అనుమానించారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రేఖ.. బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేస్తూ కనిపిస్తారు.

చదవండి: అమితాబ్‌-రేఖల లవ్‌ ట్రాక్‌: జయా బచ్చన్‌ ఏమన్నారంటే

మరిన్ని వార్తలు