అలాంటి వీలునామా ఎవ్వరూ రాసి ఉండరు..

14 Mar, 2021 08:54 IST|Sakshi

సినీ పరివారం

రేలంగిని ఆప్యాయంగా రేలంగోడు అంటూ సొంతవానిగా అక్కున చేర్చుకుంటారు. సినిమాలో రేలంగి కనపడితే నవ్వులే నవ్వులు. నడక, మాట తీరు, వస్త్ర ధారణ.. అన్నీ హాస్యమే. తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి. ఆయనే రేలంగి వెంకట్రామయ్య. హాస్యంతో పాటు వీలునామా కూడా విలక్షణమే.. రేలంగి మనవరాలు గాయత్రి, తన తాతను గుర్తు చేసుకుంటూ, అందమైన సంఘటనలెన్నో సాక్షికి వివరించారు.

మా ముత్తాత రామస్వామి (రేలంగి తండ్రి) హరికథలు చెప్పేవారు. ఆయనకు తాతయ్య ఏకైక సంతానం. ఆగస్టు 13, 1910న  రావులపాడులో పుట్టారు. తాతయ్యకు నాన్న ఏకైక సంతానం. నాన్నను సత్యనారాయణబాబు, రేలంగి బాబు అని పిలిచేవారు. నాన్నగారికి మేం ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలం. తాతయ్యకు ఆడ పిల్లలంటే చాలా ఇష్టం. బంధువుల పిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుండేది. యంగ్‌మెన్స్‌ ఆర్టిస్ట్స్‌ క్లబ్‌లో తాతయ్య హార్మోనియం నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే తాతయ్య నాటకాలు వేసేవారు. పి. పుల్లయ్య గారితో కలకత్తా వెళ్లి, ఒక సినిమాలో చేశాక, చెన్నైలో ఎన్నో ఇబ్బందులు పడుతూ చిన్నచిన్న వేషాలు వేశాక, గుర్తింపు వచ్చింది. 1950 – 70 మధ్య హీరోలకు దీటుగా పని చేశారు. తాతయ్యను చూడటానికి బస్సులలో వచ్చిన అభిమానులందరికీ భోజనాలు పెట్టి పంపేవారట. 

నా పేరు పెట్టొద్దు అన్నారు...
దానధర్మాల్లో తాతయ్యకు మంచి పేరు. ఎవరైనా చదువుకోవటానికి ఆర్థిక సహాయం కోసం వస్తే, ‘మంచి మార్కులతో పాస్‌ అయి చూపించాలి’ అనేవారట. 1967లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించే ముందు, ‘రేలంగి వెంకటేశ్వర యూనివర్సిటీ’ అని పేరు పెడతాం, ఐదు లక్షలు విరాళం ఇవ్వమన్నారట. అందుకు తాతయ్య, ‘నా పేరు పెట్టక్కర్లేదు, నాలుగు లక్షలు ఇస్తాను, మా వాళ్లందరికీ చదువు రావాలని మొక్కుకోండి’ అన్నారట. దానధర్మాలలో ‘నాగయ్యగారి తరవాత రేలంగి గారు’ అన్న పేరు సంపాదించుకున్నారు. 

పిల్లల మీద చాలా ప్రేమ..
దక్షిణాది భాషల చిత్రాల షూటింగ్‌లన్నీ వాహిని స్టూడియోలో జరిగేవి. ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా గార్డెన్స్‌ను తాతయ్య 1956లో కొని, అందులో పంటలు పండించారు. ఆ చోటును∙వాహిని వారికి లీజ్‌కిచ్చారు. ఆ స్థలం తాలూకు వీలునామా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడ, మగ తేడా లేకుండా ఎంతమంది మనవలు పుడితే అంతమంది సమానంగా అనుభవించేలా విల్లు రాయించారు. అప్పటికి నాన్నకి ఇంకా వివాహం అవ్వలేదు. నాన్న జీవించినంత కాలం ఆ ఆస్తిని మనవలకు అమ్మే హక్కు లేకుండా రాయించారు. ఆ వీలునామా ఎన్నటికీ మరచిపోలేని విషయం. 

తాతయ్యతో చూడలేకపోయాం..
తాతయ్యతో ఎక్కువ సమయం గడపలేక పోయామనే బాధ ఉంది మాకు. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. మాయాబజార్, పాతాళభైరవి వంటి చిత్రాలు తాతయ్యతో కలిసి చూడలేకపోయాం. ఆయన నటించిన సినిమాలన్నీ టీవీలో చూస్తూ, ఎంజాయ్‌ చేస్తాం. తాతయ్య 360కి పైగా సినిమాలు చేశారని తరవాత తెలిసింది. సినిమా పరిశ్రమలో ఉండే రాజకీయాలు తాతయ్యకి తెలుసు. అందుకే నాన్నను సినిమాలలోకి వద్దన్నారు. నాన్న ‘బాలానందం’ అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాతయ్య చివరి రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఎవరైనా వస్తే ఉండటానికి వీలుగా అక్కడ పోర్షన్స్‌గా కట్టించారు. తాతగారికి మనుషులు కావాలి. నాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికే తాతయ్య పోయారు. ఆయన పోయాక కూడా ఆంధ్ర నుంచి తెలుగువారు చెన్నై వచ్చి మా ఇంట్లో ఉండేవారు.

మద్రాసు పాండీబజార్‌లో...
తాతయ్య బాగా డబ్బు సంపాదించిన రోజుల్లో, మద్రాసు పాండీ బజారులో థియేటర్‌ కడదామనుకున్నారు. కాని తాతగారి బంధువులంతా తాడేపల్లిగూడెంలో ఉండటంతో, ‘మన పేరు తెలిసేచోట కడితే, మనల్ని పదికాలాల పాటు గుర్తు చేసుకుంటారు’ అని తాడేపల్లి గూడెంలో 1962లో ‘రేలంగి చిత్ర మందిర్‌’ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు థియేటర్‌ ప్రారంభించారు. అందులో విడుదలైన మొదటి సినిమా లవకుశ. ఇప్పుడు అది బాగా పాతబడిపోవటంతో ‘పద్మశ్రీ వెంకట్రామయ్య మాల్‌’ గా మారుస్తున్నాం. 

మనవలంటే ప్రాణం...
తాతయ్యకు మనవలంటే మహా ఇష్టం. మాతో చాలా స్నేహంగా ఉండేవారు. నానమ్మతో మా గురించి చెప్పుకుంటూ మురిసి పోయేవారట. మేమంతా మద్రాసులోనే పుట్టి పెరిగాం. తాతయ్య సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఇంటి విషయాలన్నీ నానమ్మ చూసుకునేది. మా బంధువులలో చాలామందికి తాతయ్యే పెళ్లిళ్లు జరిపించారు. 

తాతగారి డాడ్జ్‌ కారు నెంబరు ఎంఎస్‌ఆర్‌ 1722. అప్పట్లో పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కారు నెంబరుతో పిలిచేవారు. అలా వినటం వల్ల నెంబరు గుర్తుండిపోయింది. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా అందరినీ బయటకు తీసుకువెళ్లేవారు. పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలామందిని తనతో ఢిల్లీ తీసుకువెళ్లారు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేవారు. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల, మాతో ఎక్కువ సమయం గడపేవారు కాదు. కాని మా బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకున్నారు. షైన్‌ వేలాంకణి స్కూల్‌లో చేర్పించారు. అందువల్ల మాకు చదువులో మంచి ఫౌండేషన్‌ పడింది. 

– గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు

అందరూ చక్కగా ఉన్నారు...

తాతగారి వైపు బంధువులంతా వృద్ధిలోకి వచ్చారు. తాతగారి దగ్గర పనిచేసిన మేనేజర్, మా నాన్నగారి దగ్గర కూడా చేశారు. అప్పట్లో మేం తాతాజీ సినిమాలు చాలా తక్కువ చూశాం. తాతాజీతో ఒకటిరెండు ప్రివ్యూలకు వెళ్లాం. ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయామని బాధపడతాం. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. 

మరచిపోలేని అదృష్టాలు...
తాతాజీతో బీచ్‌కి వెళ్లినరోజులు ఇప్పటికీ మరిచిపోలేం. మద్రాసు బీచ్‌లో కారు ఆపుకుని, సముద్రం వరకు నడిచేవాళ్లం. తాతాజీకి ఫోల్డింగ్‌ చైర్‌ తీసుకువెళ్లేవాళ్లం. ఆయన అందులో కూర్చునేవారు. చాలాసేపు అక్కడే ఆడుకునేవాళ్లం. మేం ఏం కొనుక్కోవాలన్నా నానమ్మకే చెప్పేవాళ్లం. ఇంటి విషయాలన్నీ నానమ్మకు వదిలేశారు. తాతాజీ సంపాదనంతా నానమ్మకి ఇచ్చేవారు. నానమ్మ తన దగ్గర నగలన్నీ ఎవరికి కావాలంటే వారికి పెట్టేసేది. అందరికీ పెట్టగలిగేంత బంగారం ఉండేది. ఇంట్లో చాలామంది భోజనాలు చేసేవారు. నేను తాతాజీ వాళ్ల అమ్మలా ఉంటానని, నన్ను ‘అమ్మ’ అని పిలిచేవారు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, అత్తవారిళ్లకు వెళితే ఎలా అని బెంగగా ఉండేవారు. తాతాజీ తన చేతుల మీదుగా ఒక్క మనవరాలికి మాత్రమే కన్యాదానం చేశారు. ఇంకా కొంతకాలం ఉండి ఉంటే, మాకు కూడా చేసేవారేమో.

అందరి ఫంక్షన్లు బాగా ఘనంగా చేశారు. అది లోటే మాకు. జకార్తా వెళ్లినప్పుడు వాచ్‌ తెచ్చారు. స్ట్రాప్స్, బెల్టులు మార్చుకోవచ్చు. ఇప్పుడు పనిచేయకపోయినా, ఆయన గుర్తుగా ఉంచుకున్నాను. మా అక్కను అపురూపంగా చూసేవారు. కారులోనే స్కూల్‌కి వెళ్లేది. అక్క చిన్నప్పటి నుంచి సుకుమారం. 

ఆ వీలునామాలో ముందుజాగ్రత్త...
‘‘మాది రైతు కుటుంబం కనుక, తాతగారి పొలం ఆడ, మగ తేడా లేకుండా నా కొడుకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ సమానంగా ఇవ్వాలి. వారంతా నా పేరు చెప్పుకుని కడుపు నిండా తినాలి’’ అన్నారట తాతయ్య. అప్పటికి మా నాన్న వయసు పందొమ్మిది సంవత్సరాలు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. తాతయ్య పెద్దగా చదువుకోకపోయినా ఎంతో దూరదృష్టితో ఈ పని చేసి ఉంటారనుకుంటాం. మనవలు అమ్మకుండా, డబ్బు పాడవ్వకుండా ఆ రోజుల్లో అంత బిగింపుగా వీలునామా రాశారంటే తాతయ్య నిజంగా చాలా గొప్పవారనిపిస్తుంది.

మా కుటుంబం
తాతాజీకి మేం ఆరుగురు మనవలం. పెద్దక్కయ్య చాముండేశ్వరీ దేవి, అన్నయ్య తిరుమలబాబు, మూడు నేను గాయత్రీ దేవి, నాలుగు రాజ్యలక్ష్మి, ఐదు శ్రీదేవి (నానమ్మ పేరు, తాతగారు నానమ్మని శ్రీదేవమ్మ అని పిలిచేవారు), ఆరు హేమంత్‌కుమార్‌. మేమంతా నానమ్మను అమ్మ అనేవాళ్లం. తాతయ్యను తాతాజీ అనేవాళ్లం. మా నాన్నగారు కూడా అలాగే పిలిచేవారు. ఏం కొనాలన్నా వాళ్ల సలహా తీసుకునేవాళ్లం. నాన్నగారు ఆరు సంవత్సరాల క్రితం, అమ్మ రెండు సంవత్సరాల క్రితం పోయారు. తాతాజీ, నానమ్మలే కాకుండా మా అమ్మనాన్నలు కూడా లేకపోవటం మాకు ఎంతో పెద్ద నష్టం అనిపిస్తుంది. 1975లో తాతాజీ కన్నుమూశారు.
– గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు

సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు