Chiranjeevi: ఆ ఇమేజ్‌ నాది అనుకుంటే అమాయకత్వం, మూర్ఖత్వమే

5 Oct, 2022 07:52 IST|Sakshi

‘‘స్టార్‌ ఇమేజ్‌ ఉన్నప్పటికీ నేను నిరాడంబరంగా ఉంటానని ఇండస్ట్రీ వాసులు అంటున్నారు. కానీ ఓ శిల్పం బాగుందంటే అది ఆ శిల్పం గొప్పదనం కాదు.. ఆ శిల్పం చెక్కినవారిది.. మోసినవారిది.. గుర్తించినవారిది. అలాగే నా ఇమేజ్‌ కూడా నాది కాదు. నాకు అవకాశాలు కల్పించిన దర్శక–నిర్మాతలు, సహకరించిన నటీనటులు, ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులది. నా ఇమేజ్‌ నాది అనుకుంటే అది నా అమాయకత్వం, మూర్ఖత్వమే అవుతుంది’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళ ‘లూసీఫర్‌’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్‌’ రూపొందింది. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌.బి. చౌదరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. 

ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘రొటీన్‌గా పాటలు, హీరోయిన్‌, ఫైట్స్‌... ఇవి లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రామ్‌చరణ్‌ ‘లూసీఫర్‌’ గురించి చెప్పాడు. తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ‘లూసీఫర్‌’ చూశాను. ఎక్కడో వెలితి.. అసంతృప్తి. సత్యానంద్‌గారు, మోహన్‌ రాజా చెప్పిన మార్పులతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫైట్స్, హీరోయిన్‌, పాటలు అనే ఆలోచనలు రాకుండా కథ, అందులోని నా క్యారెక్టర్‌తోనే ప్రేక్షకులు ట్రావెల్‌ అవుతారు. ఫైట్స్, రొమాన్స్‌, యాక్షన్‌ వంటి అంశాలను కట్‌ చేసినా కథలోని సోల్‌కు కనెక్ట్‌ అయితే ఆ సినిమా భవిష్యత్‌ దాదాపు తెలిసిపోతుంది. 

‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం విజయం సాధిస్తుంది. మోహన్‌రాజా బాగా తెరకెక్కించాడు. సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ బాగా నటించారు. తమన్‌ మ్యూజిక్‌ అదిరిపోతుంది. ఆర్బీ చౌదరిగారు లెజండరీ ప్రొడ్యూసర్‌. ఆయన నిర్మాణసంస్థ వంద సినిమాల మైలురాయికి దగ్గరపడుతోంది. వందో సినిమాలో నన్ను చేయమన్నట్లుగా అడిగారు. మంచి కథ కుదరితే చేస్తాను. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌గారు మా ఫ్యామిలీ మెంబర్‌. ‘గాడ్‌ ఫాదర్‌’పై ప్రేక్షకుల అభిమానం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 

రీమేక్‌ అనగానే ఎందుకు తక్కువ భావనతో చూస్తారో నాకు అర్థం కావడం లేదు. రీమేక్‌ అనేది ఓ చాలెంజ్‌. నేను చేసిన రీమేక్‌ మూవీస్‌ కూడా మాతృకల కంటే ఎక్కువ కలెక్షన్స్‌ సాధించాయి. యాక్టర్‌గా నాకు పేరు తీసుకువచ్చాయి. పోలికలు పెట్టినా సరే నేను నిలబడగలను అని నా హిస్టరీ చెబుతుంది. ఆ ఆత్మవిశ్వాసం నాలో ఉంది. 

రాజకీయాల నుంచి తిరిగి ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు గతంలో అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ అలానే ఉంటుందా? అనే సందేహం నాకు కలిగింది. కానీ నా ‘ఖైదీ నంబరు 150’ సినిమా ఫంక్షన్‌కు భారీగా వచ్చిన అభిమానులు, ప్రేక్షకులను చూసి ఆ అనుమానం తీరిపోయింది. వారి ప్రేమకు ధన్యవాదాలు. 

‘గాడ్‌ ఫాదర్‌’ కంప్లీట్‌ పొలిటికల్‌ అండ్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌. ఈ సినిమాలోని డైలాగ్స్‌ సమకాలీన రాజకీయాలను ఉద్దేశిస్తూ కానీ, విమర్శిస్తూ కానీ చెప్పినవి కావు. మాతృక (మలయాళ ‘లూసీఫర్‌’)లో ఉన్న కథ ఆధారంగానే ‘గాడ్‌ ఫాదర్‌’లో డైలాగ్స్‌ ఉన్నాయి. ఆ డైలాగ్‌లు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను. 

దర్శకుడు మోహన్‌ రాజా మాట్లాడుతూ – ‘‘ఈ రోజు మనం పాన్‌ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆంధ్ర సినిమా మ్యాప్‌ దేశానికి చూపించిన వ్యక్తి చిరంజీవి. 1992–2000 సమయాల్లో ఎక్కువ పారితోషికం తీసుకుంది, మార్కెట్‌ క్రియేట్‌ చేసింది చిరంజీవిగారే’’ అన్నారు. ‘‘చిరంజీవిగారితో సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ‘గాడ్‌ ఫాదర్‌’తో నెరవేరింది. ఇందుకు కారణమైన రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు’’ అన్నారు ఎన్వీ ప్రసాద్‌. ‘‘చిరంజీవిగారు–చరణ్‌ల వల్లే సల్మాన్‌ ఖాన్‌ ఈ సినిమాలో  నటించారు. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత ఆర్బీ చౌదరి. రచయిత సత్యానంద్, మాటల రచయిత లక్ష్మీభూపాల్, గేయరచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, నటుడు బ్రహ్మాజీ, ‘గెటప్‌’ శీను, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు