సౌందర్య అసలు పేరు ఏంటో తెలుసా?

17 Apr, 2021 14:04 IST|Sakshi

ఆ కోరిక తీరకుండానే చనిపోయిన సౌందర్య 

సౌందర్య... తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమె పేరు తలుచుకోగానే చక్కటి చీరకట్టులో ఓ అందమైన రూపం కళ్లముందు కదులుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది  హీరోయిన్లు వచ్చినా సౌందర్య చాలా ప్రత్యేకం. చనిపోయే వరకు ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ చనిపోయే వరకు నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగింది. సౌందర్య  మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు.  నేడు సౌందర్య వర్ధంతి సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..

ఏ పాత్రలో అయినా ఓదిగిపోయే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. బెంగుళూరులో జన్మించిన సౌందర్య  అసలు పేరు సౌమ్య. అయితే సినిమాలోకి వచ్చేముందు సౌందర్యగా పేరు మార్చుకుంది. సౌందర్య తండ్రి సత్యనారాయణ పలు కన్నడ చిత్రాలకు నిర్మాతగా, రచయితగా పనిచేశారు.  1992లో 'గంధర్వ' అనే కన్నడ చిత్రంతో సౌందర్య  సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో రైతు భారతం సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు మంచి గుర్తింపును ఇచ్చాయి. 

సౌందర్య, వెంకటేష్‌ పెయిర్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉండేది. వీరిద్దరు జంటగా నటించిన ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా వంటి సినిమాలో బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌హిట్‌గా నిలిచాయి. పవిత్ర బంధంలో సౌందర్య నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్‌లో సౌందర్య నటించిన తొలి చిత్రం సూర్యవంశ్‌. మొదటి సినిమాతోనే అమితాబ్‌ బచ్చన్‌ సరసన నటించి మెప్పించింది. దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఘనత సౌందర్యది. 

ఒకవైపు.. రమ్యకృష్ణ, మీనా లాంటి స్టార్‌ హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ గట్టి పోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం కేవలం చీరకట్టులో తెరపై కనిపించి మెప్పించింది. సౌందర్య నిర్మించిన తొలి చిత్రం ద్వీపకు జాతీయ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు దక్కాయి. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన సౌందర్యకు దర్శకత్వం వహించాలని చాలా కోరిక ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ ఇంటరర్వ్యూలో చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే హెలీకాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె చనిపోయే నటికి ఆమె వయసు 31 సంవత్సరాలే అంతేకాకుండా ఆ సమయంలో రెండు నెలల గర్భవతి కావడంతో ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుందట. అంతలోనే దారుణం జరిగి సౌందర్య మనల్ని విడిచి వెళ్లిపోయింది. ఇక ఆమె  సౌందర్య నటించిన చివరి చిత్రం నర్తన శాల. ఈ సినిమాకు బాలయ్య దర్శకత్వం వహించారు.  

చదవండి : అందుకే సౌందర్య ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు : ఆమని


 

మరిన్ని వార్తలు