Republic day 2023: వెండితెరపై దేశం కోసం పోరాడుతున్న రీల్‌ గుఢాచారులు

26 Jan, 2023 08:10 IST|Sakshi

దేశం కోసం కొందరు గూఢచారులు ‘మేరా భారత్‌ మహాన్‌’ అంటూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే ఇవి సిల్వర్‌ స్క్రీన్‌ గూఢచారుల కథలు. భారత రాజ్యాంగం అమలులోకొచ్చిన రోజు (జనవరి 26)న స్వాతంత్య్రం కోసం ప్రాణాలను లెక్కచేయని సమర యోధులను గుర్తు చేసుకుంటూ... సిల్వర్‌ స్క్రీన్‌పై దేశం కోసం పోరాడే ఈ రీల్‌ గూఢచారుల గురించి తెలుసుకుందాం. 

ఓ రహస్యాన్ని ఛేదించేందుకు ‘డెవిల్‌’గా గూఢచార్యం చేస్తున్నారు కల్యాణ్‌ రామ్‌. నవీన్‌ మేడారం దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘డెవిల్‌’. ‘ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది ఉపశీర్షిక. 1945లో బ్రిటిష్‌ పరిపాలనలో ఉన్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేమ, ద్రోహం, మోసం.. ఈ మూడు అంశాలు ఏ విధంగా ఓ గూఢచారి జీవితాన్ని ప్రభావితం చేశాయన్నదే ఈ సినిమా ప్రధానాంశం.

మరోవైపు దేశం కోసం అజ్ఞాతంలో ఉండనున్నారు విజయ్‌ దేవరకొండ. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో అజ్ఞాత గూఢచారి పాత్రలో కనిపిస్తారట విజయ్‌ దేవరకొండ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది.

ఇక 2018లో ‘గూఢచారి’గా కనిపించి సక్సెస్‌ఫుల్‌గా మిషన్‌ను పూర్తి చేసిన అడివి శేష్‌ మళ్లీ ఓ కొత్త మిషన్‌ను ఆరంభించారు. ‘గూఢచారి’ సీక్వెల్‌ ‘జీ 2’ (గూఢచారి 2)లో హీరోగా నటిస్తున్నారు. సిరిగినీడి వినయ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు యాక్షన్‌ ‘ఏజెంట్‌’గా మారారు అఖిల్‌. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్‌’. దేశం కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్‌ కానుంది.

కాగా మంచు పర్వతాల్లో తుపాకులను దాచిపెట్టారు హీరో నిఖిల్‌. ఎందుకంటే దేశం కోసం గూఢచారిగా మారారు. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్పై’. దేశానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను కనిపెట్టి, దేశద్రోహులను ఓ స్పై ఏ విధంగా మట్టుపెట్టాడన్నదే ఈ సినిమా అని తెలుస్తోంది. ‘స్పై’ను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా గూడఛారులుగా కనిపించనున్నారు. 

కోలీవుడ్‌ లోనూ కొందరు హీరోలు దేశం కోసం సాహసాలు చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంగా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ చేస్తున్నారు కమల్‌ అండ్‌ శంకర్‌. పూర్తి దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో, ఈ కాలంతోపాటు 1920 కాలం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది.

ఇక దర్శకుడిగా ‘తుపాకీ’, ‘స్పైడర్‌’ వంటి స్పై మూవీస్‌ను తీసిన ఏఆర్‌ మురుగదాస్‌ నిర్మాతగా ప్రస్తుతం ‘1947, ఆగస్టు 16’ అనే సినిమా  నిర్మించారు. గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎన్‌ఎస్‌ పొన్‌కుమార్‌ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే మరో తమిళ హీరో అరుణ్‌ విజయ్‌ నటించిన సినిమా ‘బోర్డర్‌’. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం ఇది. ఎ. వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్‌ కానుంది.

ఇక విష్ణు విశాల్‌ హీరోగా మను ఆనంద్‌ దర్శకత్వంలోవచ్చిన ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌ఐఆర్‌ 2’ని ప్రకటించారు విష్ణు విశాల్‌. కాగా గత ఏడాది విడుదలైన ‘విక్రమ్‌’ సినిమాలో కమల్‌హాసన్, ‘సర్దార్‌’లో కార్తీ రా (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు సీక్వెల్స్‌ రానున్నాయి. 

బాలీవుడ్‌లో అయితే స్పై బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్స్‌కు కొదవే లేదు. ఇప్పటికే ‘టైగర్‌ జిందా హై’, ‘ఏక్తా టైగర్‌’ వంటి స్పై బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్స్‌లో నటించిన సల్మాన్‌ ఖాన్‌ ఈ ఫ్రాంచైజీలోనే తాజాగా ‘టైగర్‌ 3’ సినిమా చేస్తున్నారు. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. అలాగే స్పై బ్యాక్‌డ్రాప్‌లో సౌత్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్‌’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు షారుక్‌ ఖాన్‌. ఈ ఏడాది జూన్‌ 2న ‘జవాన్‌’ విడుదల కానుంది.

మరోవైపు కథానాయిక సారా అలీఖాన్‌ ‘ఆయే వతన్‌.. మేరే వతన్‌’ అనే మూవీ చేస్తున్నారు. కన్నన్‌ అయ్యర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఓ కాలేజీ విద్యార్థిని స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలా పాల్గొంది? అన్నదే ఈ సినిమా కథ. అలాగే దేశ విభజన నాటి అంశాల నేపథ్యంలో ‘లాహోర్‌: 1947’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ‘ఘాయల్‌’, ‘దామిని’, ‘ఘాతక్‌’ వంటి హిట్‌ సినిమాల తర్వాత హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందనుంది.

ఇక దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ రీసెంట్‌గా స్పై బ్యాక్‌డ్రాప్‌  సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా స్పై ఫిల్మ్‌ ‘పఠాన్‌’ థియేటర్స్‌లో ఉంది. కాగా ‘వార్‌’ తర్వాత హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ చేస్తున్నారు సిద్ధార్థ్‌ ఆనంద్‌. ఇది కూడా స్పై బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ అట. అలాగే హీరో ప్రభాస్‌తో కూడా సిద్ధార్థ్‌ ఓ స్పై బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ చేస్తారని టాక్‌. ఇక హీరో జాన్‌ అబ్రహాం కూడా ‘టెహ్రాన్‌’ అనే స్పై ఫిల్మ్‌ చేస్తున్నారు. ఈ కోవలో మరికొన్ని బాలీవుడ్‌ సినిమాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు