దేవా కథ చెబుతానంటే వద్దన్నాను: సుకుమార్

6 Apr, 2021 04:02 IST|Sakshi
దేవా కట్టా, భగవాన్, సాయి తేజ్, సుకుమార్, పుల్లారావు

‘‘ప్రస్థానం’ సినిమాని మనం ఇప్పటికీ మరచిపోలేదంటే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్, న్యారేషన్‌ అంత గొప్పగా ఉంటాయి. ‘రిపబ్లిక్‌’ కథను దేవా చెబుతానంటే వద్దన్నాను. ఎందుకంటే ఓ మంచి దర్శకుడి కథను వినకూడదు.. చూడాలి. ఈ సినిమా టీజర్‌ అద్భుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం జూన్‌  4న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని సుకుమార్‌ విడుదల చేశారు. దేవా కట్టా మాట్లాడుతూ– ‘‘సుక్కు సార్‌కి ఏకలవ్య శిష్యుణ్ణి.

‘బాహుబలి’ ఎంత ల్యాండ్‌ మార్క్‌ సినిమానో ‘రంగస్థలం’ కూడా అంతే ల్యాండ్‌ మార్క్‌ మూవీ. ‘రంగస్థలం’ కారణంగానే ‘రిపబ్లిక్‌’ చేశాను’’ అన్నారు. ‘‘సాయితేజ్‌తో తొమ్మిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రతిఫలమే ‘రిపబ్లిక్‌’ చిత్రం’’ అన్నారు జె.పుల్లారావు. ‘‘పొలిటికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది’’ అన్నారు జె.భగవాన్‌ . సాయితేజ్‌ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారు టీచర్‌ అయితే, బుచ్చిబాబు ఫస్ట్‌ బెంచ్‌ స్టూడెంట్‌.. దేవాగారు మిడిల్‌ బెంచ్, నేను లాస్ట్‌ బెంచ్‌. నిజాయతీగా చేసిన ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. మణిశర్మగారితో పని చేయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నటులు మనోజ్‌ నందం, రవివర్మ, స్క్రీన్‌  ప్లే రైటర్‌ కిరణ్‌ జై కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు